Sajjala Ramakrishna Reddy: అది మాత్రం చంద్రబాబుకే సాధ్యం.. ఒప్పుకోవాల్సిందే: సజ్జల వ్యంగ్యం
- చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారంటూ సజ్జల ఆగ్రహం
- చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేదని విమర్శ
- చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి హడావుడి చేశారన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు
- నడ్డాతో వంగి వంగి.. నంగి నంగి మాట్లాడారని విమర్శలు
- పొత్తుల కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ పరువు తీస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాలు ప్రజల కోసం ఉండాలి తప్ప స్వప్రయోజనాల కోసం ఉండకూడదన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది లేదని ఎద్దేవా చేశారు. 2024లో అధికారంలోకి వస్తే ఏదో చేస్తానని చెబుతోన్న టీడీపీ అధినేత 2019 వరకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మాట్లాడిన తీరు ప్రజలందరికీ తెలుసునన్నారు. తాము పవన్ కల్యాణ్‌తో లేమని, బీజేపీతో ఉండమని చెబితే లోకేశ్ పాదయాత్రకు అంతమంది జనాలు వస్తారా? అన్నారు. లోకేశ్ పాదయాత్రకు కార్యకర్తలే రావడం లేదన్నారు.
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన బఫూన్‌కు ఎక్కువ, జోకర్‌కు తక్కువ అని విమర్శించారు. పొత్తు లేకుండా ఆయన ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఎప్పుడూ చేయలేదన్నారు. తిట్టిన నోటితోనే మళ్లీ బీజేపీని పొగుడుతున్నారన్నారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో వంగి వంగి.. నంగి నంగి మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఏపీ పరువు తీస్తున్నారన్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలకు ఏం చేస్తారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గురించి మాత్రం మనం ఒకటి ఒప్పుకోవాలని, ఆయన ఎవరినైనా గంటలో తిట్టి మళ్లీ గంటలో కాళ్లు పట్టుకోగలరన్నారు. ఇది ఆయనకే సాధ్యమని అంగీకరించాలన్నారు.
పొత్తుల కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారన్నారు. బీజేపీ, టీడీపీ కలవాలనుకుంటే ఎవరు ఆపుతారని ప్రశ్నించారు. ప్రజలను భ్రమల్లో పెట్టాలనుకునే వారు భ్రమల్లోనే ఉంటారన్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 175 చోట్ల సొంతంగా పోటీ చేస్తానని చెప్పలేకపోతున్నారని విమర్శించారు. పవన్ సపరేట్గా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా అంతా చంద్రబాబు ప్లానే అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నారని, కానీ అసలు ఆ వ్యతిరేకత ఉందా? అని ప్రశ్నించారు. ఉన్నా ఎంత మేర ఓట్లు చీలుతాయో తెలియాలన్నారు. తమకు మాత్రం 70 శాతం పాజిటివ్ ఓటు ఉందని చెప్పారు. మిగతా 30 శాతాన్ని ప్రతిపక్షాలు పంచుకుంటాయన్నారు.