YS Jagan: జగన్ యూకే పర్యటనకు అనుమతిపై నిర్ణయం వాయిదా వేసిన సీబీఐ కోర్టు
- ఈ రోజు వాదనలు వినిపించిన సీబీఐ
- విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ వాదనలు
- నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం
- విజయసాయిరెడ్డికి అనుమతిపై కూడా నిర్ణయం రేపటికి వాయిదా
యూకే వెళ్లడానికి అనుమతి కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు వాయిదా వేసింది. జగన్తో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటన కోసం అనుమతి కోరారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి.
సెప్టెంబర్ 2న లండన్లోని తన కూతురును చూసేందుకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని, ఇందుకు దేశం విడిచి వెళ్లరాదన్న తన బెయిల్ షరతులను సడలించాలని జగన్ తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ రోజు సీబీఐ వాదనలు వినిపించింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని కోర్టుకు విన్నవించింది. వాదనల అనంతరం విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.
మరోవైపు యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, ఈ రోజు వాదనలు ముగిశాయి. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ... కోర్టును కోరింది. ఈ రోజు వాదనలు ముగియడంతో న్యాయస్థానం తన నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.