Noor Inayat Khan: భారత సంతతి మహిళా గూఢచారి చిత్రపటాన్ని ఆవిష్కరించిన బ్రిటన్ రాణి
- రాయల్ ఎయిర్‌ఫోర్స్ క్లబ్లో గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్ చిత్రపటం ఆవిష్కరణ
- విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఇనాయత్‌కు బ్రిటన్ రాణి నివాళి
- ఎయిర్‌ఫోర్స్ క్లబ్లో ఓ గదికి నూర్ పేరుమీదుగా నామకరణం
- రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌కు గూఢచారిగా విశేష సేవలు అందించిన నూర్ ఇనాయత్ ఖాన్
- జార్జి క్రాస్ మెడల్ దక్కించుకున్న మహిళగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్న వైనం
టిప్పు సుల్తాన్ వంశస్తురాలు, భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మహిళా గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్ చిత్రపటాన్ని బ్రిటన్ రాణి కెమిల్లా తాజాగా ఆవిష్కరించారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో నూర్ ఇనాయత్ ఖాన్ బ్రిటన్‌కు చేసిన సేవలను బ్రిటన్ రాణి గుర్తుచేసుకుని ఘన నివాళి అర్పించారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ క్లబ్‌లోని ఓ గదికి ఇనాయత్ ఖాన్ పేరు మీద నామకరణం కూడా చేశారు. ఈ సందర్భంగా ఇనాయత్ ఖాన్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రముఖ భారత సంతతి రచయిత్రి శ్రాబణి బసూ బ్రిటన్ రాణికి బహూకరించారు. ఎయిర్స్ ఫోర్స్ క్లబ్ ఇనాయత్ ఖాన్ చిత్రపటం ఆవిష్కరణ ఎంతో గర్వకారణమని, ఆమె జీవిత చరిత్ర రాసే అవకాశం దక్కడాన్ని ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.
బ్రిటన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మహిళా విభాగంలో ఇనాయత్ ఖాన్ విశేష సేవలు అందించారు. విధి నిర్వహణలో తీవ్ర ప్రమాద సమయాల్లోనూ అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమెను జార్జ్ క్రాస్తో సత్కరించింది. ఎయిర్ ఫోర్స్ మహిళా విభాగంలో ఈ పురస్కారం దక్కించుకున్న ఇద్దరు మహిళల్లో ఇనాయత్ ఖాన్ ఒకరు.
నూర్ 1914లో మాస్కోలో జన్మించారు. ఆమె తండ్రి భారత్‌కు చెందిన సూఫీ సన్యాసి కాగా తల్లి అమెరికా మహిళ. చిన్నతనంలోనే బ్రిటన్‌కు వెళ్లిన ఆమె ఆ తరువాత ఫ్రాన్స్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ ఓటమి తరువాత ఇంగ్లండ్‌కు చేరుకున్న ఆమె బ్రిటన్ ఎయిర్ ఫోర్స్‌లోని మహిళా విభాగంలో చేరారు. నిఘా కార్యకలాపాలు, గూఢచర్యంతో శత్రుమూకల కట్టడి కోసం ఉద్దేశించి ఎస్ఓఈ విభాగంలో చేరారు. ఫ్రాన్స్‌పై నిఘా కోసం నియమించిన తొలి మహిళా గూఢచారిగా ఆమె రికార్డు సృష్టించారు. పలు ప్రమాదకర మిషన్లలో తన అసాధారణ ధైర్యసాహసాలతో బ్రిటన్‌కు విజయాలు అందించారు. శత్రుమూకలకు చిక్కినా ఆమె బ్రిటన్ సమాచారాన్ని బయటకు చెప్పలేదు. నూర్ మరణానంతరం బ్రిటన్ ప్రభుత్వం ఆమెను జార్జి క్రాస్ అవార్డుతో సత్కరించింది.