EPFO: ఈపీఎఫ్ వో కొత్త రూల్.. వ్యక్తిగత వివరాల్లో మార్పులు ఇక ఈజీ
- దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లో పరిష్కారం
- కేవలం ఒక్కసారి మాత్రమే మార్పులకు అవకాశం
- మోసాలను నియంత్రించేందుకేనన్న అధికారులు
ఉద్యోగుల వ్యక్తిగత వివరాలలో పొరపాట్లు, తప్పులను సవరించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ వో) కొత్త రూల్ ను తీసుకొచ్చింది. దీంతో వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేర్పులు మరింత సులభం కానుందని పేర్కొంది. అదే సమయంలో మోసాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు, ఈ మార్పులకు కేవలం ఒకేసారి అవకాశం కల్పించినట్లు తెలిపింది. ఉద్యోగి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించేలా సిబ్బందికి గడువు విధించినట్లు వివరించింది. చిన్న చిన్న సవరణలను వారం రోజుల్లోపు పూర్తిచేయాలని సూచించింది. ఈ ఆదేశాలను, సూచనలను పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఉద్యోగి వ్యక్తిగత సమాచారంలో పొరపాట్ల కారణంగా చాలా క్లెయిమ్ లు తిరస్కారానికి గురవుతున్నాయి. నగదు ఉపసంహరణ, ఉద్యోగ విరమణ తర్వాత పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలన్నా, పింఛన్ కు దరఖాస్తు చేసుకోవాలన్నా ఈపీఎఫ్ వో చందాదారులు ఇబ్బంది పడుతున్నారు. పరిష్కారం కోసం వ్యక్తిగత వివరాల్లో సవరణలకు ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. చందాదారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను గుర్తించి, దీనిని పరిష్కరించేందుకే కొత్త రూల్ ను తీసుకొచ్చినట్లు ఈపీఎఫ్ వో పేర్కొంది.
ఏయే సవరణలకు అవకాశం ఉందంటే..
- పేరు, స్త్రీ/పురుషుడు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, బంధుత్వం, వివాహం, ఈపీఎఫ్ వో లో చేరిన తేదీ, ఆధార్ నెంబర్, ఉద్యోగంలో చేరిన/ వదిలిపెట్టిన తేదీ, జాతీయత
- ఇందులో వివాహ స్థితిని మార్చుకునేందుకు రెండుసార్లు, మిగతా వివరాల్లో ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఒకటికంటే ఎక్కువ సార్లు సవరణ చేయాల్సి వస్తే నిర్ణయాధికారాన్ని ఈపీఎఫ్ వో ప్రాంతీయ కమిషనర్లకు కల్పించింది.
- సవరణలు చిన్నవైతే రెండు ధ్రువీకరణ పత్రాలు, పెద్దవైతే మూడు ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తులకు జత చేయాలి.
- దరఖాస్తులను సకాలంలో ఆమోదించకున్నా.. గడువు లోగా పరిష్కరించకున్నా ఈపీఎఫ్ఐజీఎంఎస్ పోర్టల్ ద్వారా చందాదారులు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది.