Babar Azam: విరాట్ కోహ్లీపై పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రశంసలు
- కోహ్లీ నుంచి ప్రశంసలు లభిస్తే ఎంతో గర్వంగా ఉంటుందన్న బాబర్
- అతడు తనతో మాట్లాడిన తీరు ఆకట్టుకుందని వ్యాఖ్య
- కెరియర్‌లో చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడి
వన్డే ప్రపంచకప్‌నకు ముందు ‘ట్రైలర్’లా ఆసియా కప్ మొదలైంది. తొలి మ్యాచ్‌లో పసి కూన నేపాల్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 2న జరగబోయే భారత్– పాకిస్థాన్ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రశంసలు కురిపించాడు.
ఎవరి దగ్గరి నుంచైనా సానుకూల కామెంట్లు వస్తే చాలా ఆనందంగా ఉంటుందని, అలాంటిది విరాట్ కోహ్లీ నుంచి ప్రశంసలు వస్తే ఎంతో గర్వంగా ఉంటుందని బాబర్ చెప్పాడు. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి ప్రశంసలు లభిస్తే ఎంతో గర్వకారణంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఏ ఆటగాడికైనా ఆత్మవిశ్వాసం పెంచుతుంది” అని తెలిపాడు.
‘‘2019 వరల్డ్‌కప్ సందర్భంగా కోహ్లీని కలిశాను. అప్పుడు కెరియర్ పరంగా ఉన్నతస్థాయిలో విరాట్ ఉన్నాడు. ఇప్పుడూ పీక్ లోనే ఉన్నాడనుకోండి. అతడి నుంచి నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని అప్పట్లో కలిసేందుకు వెళ్లా. కోహ్లీ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. బ్యాటింగ్ గురించి ఎన్నో అడిగాను. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కెరియర్‌లో చాలా ఉపయోగపడ్డాయి” అని బాబర్ గుర్తుచేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది.