Viacom-18: మీడియా హక్కులకు రూ.6 వేల కోట్లు... బీసీసీఐపై కాసుల వర్షం
- 2023-28 సీజన్లకు గాను మీడియా హక్కులు చేజిక్కించుకున్న వయాకామ్ 19
- టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న వయాకామ్
- ఈ-వేలంలో వయాకామ్ కు సోనీ పిక్చర్స్, డిస్నీ స్టార్ నుంచి తీవ్రమైన పోటీ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ను ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అని ఎందుకు అంటారో మరోసారి నిరూపితమైంది. టీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచ్ ల మీడియా హక్కుల రూపేణా బీసీసీఐపై కాసుల వర్షం కురిసింది.
ఈ-వేలంలో బీసీసీఐ మీడియా హక్కులను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 సంస్థ చేజిక్కించుకుంది. ఇందుకోసం వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి కళ్లు చెదిరే రీతిలో రూ.6,000 కోట్లు చెల్లించనుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్ లను వయాకామ్ తన స్పోర్ట్స్-18 చానల్లో ఐదేళ్ల పాటు ప్రసారం చేయనుంది. ఈ ఏడాది నుంచి 2028 వరకు అన్ని సీజన్లలో మ్యాచ్ లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
మీడియా హక్కుల కోసం నిర్వహించిన ఈ-వేలంలో వయాకామ్ 18 సంస్థకు డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది.