IMD: గత నెలలో వానలు లేక అల్లాడిన ప్రజానీకానికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్!
- గత నెలలో మొహం చాటేసిన వానలతో ప్రజల బేజారు
- ఈ నెలలో తొలివారంలోనే వానలు పలకరిస్తాయన్న వాతావరణ శాఖ
- అరేబియా, బంగాళాఖాతం సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారినట్టు వెల్లడి
- ఈ నెల సగటు వర్షపాతానికి 9% అటూఇటూగా వానలు కురుస్తాయని అంచనా
ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా గత నెలలో మొహం చాటేసిన వానలు ఈ నెలలో మళ్లీ పలకరిస్తాయని వాతావరణ శాఖ తాజాగా భరోసా ఇచ్చింది. దక్షిణాది, మధ్య భారత్‌లో ఈ వారం వానలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
‘‘జులైలో అధిక వర్షాల తరువాత ఆగస్టులో చాలా వరకూ రుతుపవనాలు మొహం చాటేశాయి. నెలలో 20 రోజుల పాటు ఎక్కడా చినుకుపడలేదు. ఎల్‌నినో పరిస్థితులే దీనికి కారణం. అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కారణంగా ఇప్పుడు ఎల్‌నినో సానుకూలంగా మారడం ప్రారంభమైంది. దీంతోపాటూ తూర్పు దిశగా మేఘాల పయనం, ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షపాతం వంటివీ రుతుపవనాల పునరుద్ధరణకు అనుకూలంగా మారుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.
సెప్టెంబర్ నెల దీర్ఘకాలిక సగటు వర్షపాతం 167.9 మి.మీకు 9 శాతం అటూఇటూగా ఈ నెల వానలు కురుస్తాయని అన్నారు. అధిక వర్షపాతం నమోదైనా అది జూన్-సెప్టెంబర్ కాలపు సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చని అంచనా వేశారు.