Kaushal Kishore: కేంద్రమంత్రి ఇంట్లో యువకుడి కాల్చివేత.. మంత్రి కుమారుడి పేరుతో ఉన్న లైసెన్స్‌డ్ గన్ స్వాధీనం

Man shot dead inside Union Minister Kaushal Kishores Lucknow home
  • ఈ తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో లక్నోలో ఘటన
  • మృతుడు వినయ్ శ్రీవాస్తవగా గుర్తింపు
  • బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి
  • నిందితులను వదిలిపెట్టబోమని హెచ్చరిక
  • ఆ సమయంలో ఇంట్లో ఎవరున్నారో తనకు తెలియదన్న బీజేపీ నేత
కేంద్రమంత్రి కౌషల్ కిషోర్ ఇంట్లో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మరణించాడు. మృతుడిని వినయ్ శ్రీవాస్తవ్‌గా గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ తెల్లవారుజామున జరిగిందీ ఘటన. వినయ్ తుపాకి కాల్పుల్లో మరణించినట్టు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 4.15 గంటలకు బెగారియా గ్రామంలోని మంత్రి ఇంట్లో ఈ ఘటన జరగ్గా.. మంత్రి కుమారుడి పేరుతో ఉన్న లైసెన్స్‌డ్ తుపాకిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సమాచారం అందుకున్న వెంటనే డాగ్‌స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ బృందాలు మంత్రి ఇంటికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. వినయ్ శ్రీవాస్తవ్ అనే వ్యక్తి  కాల్పుల్లో మరణించాడని, మంత్రి కుమారుడు వికాశ్ కిషోర్ పేరున ఉన్న లైసెన్స్‌డ్ తుపాకిని స్వాధీనం చేసుకున్నామని లక్నో డీసీపీ (వెస్ట్) రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఈ ఘటనపై బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులను వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగినప్పుడు తన ఇంట్లో ఎవరు ఉన్నారన్న విషయం తనకు తెలియని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Kaushal Kishore
BJP
Lucknow
Man Shot Dead
Vinay Shrivastave
Vikas Kishore

More Telugu News