Perni Nani: హిందూస్థాన్ టైమ్స్‌లో వచ్చిన వార్త నిజమా? కాదా?: చంద్రబాబు సహా ఆ ముగ్గురికి పేర్ని నాని సవాల్

Perni Nani challanges Chandrababu Naidu

  • తాత్కాలిక రాజధాని పేరుతో ముడుపులు కొట్టేశారని ఆరోపణ
  • ఐటీ నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని నిలదీత
  • హిందుస్థాన్ టైమ్స్‌లో పెద్ద వార్త వస్తే ఆ ముగ్గురు ఎందుకు రాయలేదని ప్రశ్న
  • లోకేశ్ పాదయాత్ర ఆపేసి, తన తండ్రి అవినీతి వార్తపై స్పందించాలని సవాల్

తాత్కాలిక రాజధాని పేరుతో చంద్రబాబు ముడుపులు కొట్టేశారని, ఆయన గుట్టును ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ బయటపెట్టిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఈ మేరకు హిందూస్థాన్ టైమ్స్ పత్రికలో వార్త వచ్చిందన్నారు. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేశాడో బయటపడిందన్నారు. తాత్కాలిక రాజధాని పేరుతో కాంట్రాక్టులు కట్టబెట్టి కంపెనీల నుండి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఈ ముడుపుల వ్యవహారం నడిపారన్నారు. ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టులతో రూ.118 కోట్ల ముడుపులు అందాయన్నారు. మనోజ్ పార్థాని ముడుపులు ఇచ్చినట్లుగా తేలిందన్నారు.

హిందూస్థాన్ టైమ్స్‌లో వచ్చిన వార్త నిజమా? కాదా? చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూస్థాన్ టైమ్స్ తప్పుడు వార్తలు రాసిందా? లేక చంద్రబాబు అమాయకులా? అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజం కాదా? ఇందులో ముడుపులు తిన్నారా? లేదా? ఇన్‌కం ట్యాక్స్ సెప్టెంబర్ 22న నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు పెదవి విప్పలేదు? హిందుస్థాన్ టైమ్స్‌పై పరువు నష్టం దావా వేసే దమ్ముందా? వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. అమరావతిలోనే ఇంత తీసుకుంటే మిగతా పనుల్లో ఎంత తీసుకున్నారో? అని అనుమానం వ్యక్తం చేశారు. కాంట్రాక్టులు కట్టబెట్టి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.

ఆ ముగ్గురు ఎందుకు రాయలేదు?

జగన్-మోదీ, జగన్-భారతి, జగన్-విజయలక్ష్మి ఏం మాట్లాడుకుంటున్నారో రాయగలిగే సత్తా కలిగిన ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులు ఈ వార్తను ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పుడో ఏడాది క్రితం నోటీసులు ఇస్తే ఎవరికీ తెలియకుండా ఉందన్నారు. కనీసం హిందూస్థాన్ టైమ్స్‌లో ఇంత పెద్ద వార్త పడితే టీడీపీ అనుకూల మీడియా ఎందుకు రాయలేదన్నారు. కనీసం... చంద్రబాబుకు ఇన్‌కం ట్యాక్స్ నోటీసులు ఇస్తుందా? ఎంత ధైర్యం అని లేదా ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చెడిపోయిందని అయినా రాయాలి కదా అన్నారు. కానీ ఈ వార్తను వారు తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

చంద్రబాబు గారూ! గుర్తు పెట్టుకోండి...

చంద్రబాబు గారూ! మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని ఎన్టీఆర్ ఆత్మ వెంటాడుతుందని నాని హెచ్చరించారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ పైనుండి కక్ష తీసుకునే పనిలో ఉన్నారని, అదే సమయంలో జగన్‌ను ఆశీర్వదిస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌కు మీరు వెన్నుపోటు పొడిస్తే మీకు రాజకీయాల్లో కుక్కచావును జగన్ చూపిస్తున్నాడన్నారు. పార్టీ అయినా, వ్యక్తి అయినా.. ఏదైనా చంద్రబాబు తనకు అవసరం ఉంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడని, కానీ అవసరం తీరితే మాత్రం చెత్తకుండిలో వేస్తాడని విమర్శించారు. ఎవరినైనా వాడుకొని వదిలేయడంలో టీడీపీ అధినేత దిట్ట అన్నారు.

చంద్రబాబుకు నిజాయతీ ఉంటే మీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ ద్వారా రెండు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి రూ.120 కోట్ల ముడుపులు తీసుకున్నది నిజమా? కాదా? చెప్పాలన్నారు. హిందూస్థాన్ టైమ్స్ రాసిన దాంట్లో నిజం లేదా? వాస్తవం బయటకు రావాలన్నారు. అలాగే ఏబీఎన్, ఈనాడు, టీవీ5లకు తాను సవాల్ విసురుతున్నానని, చంద్రబాబుకు ఇన్‌కం ట్యాక్స్ నోటీసులు ఇచ్చిన వార్త రాయాలన్నారు. పద్మశాలి ఆడకూతురుపై పరువు నష్టం దావా వేయడం కాదని, నీ పాదయాత్ర ఆపేసి, నీ తండ్రి అవినీతిపై మాట్లాడాలని లోకేశ్ కు నాని సూచించారు. అలాగే హిందూస్థాన్ టైమ్స్‌పై పరువు నష్టం దావా వేస్తావా? అని సవాల్ చేసారు. ఇన్‌కం ట్యాక్స్ నోటీసులపై కూడా స్టే తెచ్చుకుంటారా? అని ప్రశ్నించగా, విజయమ్మ, లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్లపై చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నాడని, ఇప్పుడు కూడా అలాగే తెచ్చుకుంటాడని ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News