Daggubati Purandeswari: ఒకే దేశం- ఒకే ఎన్నికపై రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ... పురందేశ్వరి స్పందన
- ఒకే దేశం-ఒకే ఎన్నికపై కేంద్రం కీలక ముందడుగు
- కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ బీజేపీ చీఫ్
- రాష్ట్ర ప్రభుత్వాలకు పాలనపై దృష్టి పెట్టే సమయం లభిస్తుందని వెల్లడి
- ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, భద్రతా దళాలపై భారం పడబోదని పురందేశ్వరి వివరణ
దేశంలో లోక్ సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే బాగుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంగా ఆకాంక్షిస్తున్నారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక అంటూ పలు వేదికలపై ఆయన తన మనసులో మాట బయటపెడుతున్నారు. ఈ దిశగా కీలక ముందడుగు పడింది. ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వాగతించారు. దేశంలో ఎక్కడో ఒక చోట, ఏదో ఒక రాష్ట్రంలో తరచుగా ఏదో ఒక స్థాయిలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, దాంతో పాలనపై దృష్టి కేంద్రీకరించడం రాష్ట్రాల ప్రభుత్వాలకు కష్టతరమవుతుందని వివరించారు.
ఈ నేపథ్యంలో, ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం ఎంతో అవసరమని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఖర్చును తగ్గించడంలోనూ, పరిపాలన, భద్రతా దళాలపై భారం తగ్గించడంలోనూ ఈ విధానం దోహదపడుతుందని తెలిపారు.