Andhra Pradesh: తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వవద్దంటూ గోదావరి బోర్డుకు ఏపీ లేఖ
- సీడబ్ల్యూసీ టీఏసీ ఇచ్చిన క్లియరెన్స్‌లను వెనక్కి తీసుకోవాలి
- సమ్మక్క ప్రాజెక్టు 1978 ఒప్పందానికి విరుద్ధం
- జీఆర్ఎంబీకి ఏపీ జలవనరులశాఖ లేఖ
తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దంటూ గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరి బేసిన్‌లో నిర్మించే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని, డీపీఆర్‌లను పరిశీలన కూడా చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ఏపీ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బోర్డుకు లేఖ రాశారు. త్వరలోనే గోదావరి బోర్డు సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సమావేశంలో చర్చించే ఎజెండాను పంపాలని కోరగా ఏపీ ఈ లేఖను రాసింది.
చనకా కొరటా (రుద్ర) బ్యారేజీ, చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (ముక్తేశ్వర్)లకు నిరుడు నవంబరు 29న, గూడెం ఎత్తిపోతల పథకం, మొడికుంటవాగు ప్రాజెక్టులకు ఈ ఏడాది జులైలో కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) క్లియరెన్స్ ఇచ్చింది.
ఏపీ రాసిన తాజా లేఖలో ఆ క్లియరెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని కోరింది. అలాగే, సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ (తుపాకులగూడెం) 1978 ఒప్పందానికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. నీటి లభ్యతలపై సీడబ్ల్యూసీ అధ్యయనం ఆమోదయోగ్యం కాదన్న ఏపీ.. అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడుతోందని, కాబట్టి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరింది.