Team India: మెగా మ్యాచ్‌కు ముందు భారత్–పాక్ క్రికెటర్ల ఆత్మీయ పలకరింపు.. వీడియో ఇదిగో!
ఈ రోజు పల్లెకెలేలో భారత్–పాక్ వన్డే మ్యాచ్
నాలుగేళ్ల తర్వాత వన్డేలో పోటీ పడుతున్న దాయాది జట్లు
నిన్న ప్రాక్టీస్ సమయంలో సరదగా గడిపిన ఆటగాళ్లు
ఆసియా కప్‌లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం శ్రీలంకలోని పల్లెకెలే స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో దాయాది జట్లు నాలుగేళ్ల తర్వాత పోటీ పడుతున్న తొలి మ్యాచ్ ఇదే. చివరగా 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఇరు జట్లూ ఆఖరి వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. దాంతో ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి. తమ జట్టే గెలవాలని ఇరు దేశాల అభిమానులు ఆశిస్తున్నారు. సాధారణంగా భారత్–పాక్ మ్యాచ్ అనగానే ఇరు జట్లలోనూ భిన్నమైన, గంభీరమైన వాతావరణం కనిపిస్తుంది. అయితే, తమ వైరం మ్యాచ్‌లోనే తప్ప.. బయట కాదని భారత్, పాక్ క్రికెటర్లు మరోసారి చాటి చెప్పారు.
ఈ మ్యాచ్ కోసం నిన్న రాత్రి పల్లెకెలే స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో హరీస్ రవూఫ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి భారత్ ను గెలిపించిన విరాట్ కోహ్లీ మైదానంలో అతడిని ఆప్యాయంగా హత్తుకొని మాట్లాడాడు. పాక్ డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లి పేసర్ షాహీన్ షా, స్పిన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ తో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్ లో పాక్ సారథి బాబర్ ఆజమ్‌తో మాట కలిపాడు. పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది.