Anushka Shetty: ఏకంగా 14 భాషల్లో అనుష్క శెట్టి తొలి పాన్ వరల్డ్ సినిమా!
- మలయాళ చిత్రం ‘కథనార్.. ది వైల్డ్ సోర్సెరర్’లో కీలక పాత్ర
- రెండు పార్టులుగా రాబోతున్న హారర్ ఫాంటసీ చిత్రం
- శుక్రవారం విడుదల కానున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
ఆచితూచి సినిమాలు చేసే స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఈ మధ్య స్పీడ్ పెంచింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆమె యువ నటుడు నవీన్ పోలిశెట్టి సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా అనుష్క మరో సినిమాకు సంతకం చేసింది. ‘కథనార్.. ది వైల్డ్ సోర్సెరర్’ పేరుతో రూపొందుతున్న ఫాంటసీ హారర్ డ్రామాలో ఆమె నటించబోతోంది. మలయాళ స్టార్ జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను రోజిన్ థామస్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో హారర్, థ్రిల్లింగ్ గా ఈ చిత్రం ఉంటుందని వీడియో గ్లింప్స్ ను బట్టి తెలుస్తోంది.
అరుంధతి, భాగమతి చిత్రాల తరహాలో అనుష్క మరో పవర్‌ఫుల్ క్యారెక్టర్ పాత్రలో కనిపించనుంది. ఆమె నటిస్తున్న తొలి మలయాళ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. వచ్చే ఏడాది విడుదలయ్యే మొదటి భాగం ఏకంగా 14 భాషల్లో విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, చైనీస్, జపనీస్, కొరియన్, ఇటాలియన్, ఇండోనేషియన్, రష్యన్, జర్మన్ భాషల్లో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ లెక్కన అనుష్క నటిస్తున్న తొలి ప్యాన్ వరల్డ్ సినిమా ఇదే కానుంది.