Sajjala Ramakrishna Reddy: ముడుపులు అందినట్లు పూర్తి సమాచారం ఉన్నందునే చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చింది: సజ్జల
- ఐటీ నోటీసులు ఫేక్ అయితే ఆ విషయమైనా చంద్రబాబు చెప్పాలన్న ప్రభుత్వ సలహాదారు
- చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడ్డారో నేషనల్ మీడియా వార్తలు రాసిందన్న సజ్జల
- ఐటీ నోటీసులు, మీడియా కథనాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న
- సాంకేతిక అంశాలపై మాట్లాడి తప్పించుకునే ప్రయత్నాలని విమర్శ
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎలా అవినీతికి పాల్పడ్డారో నేషనల్ మీడియా పూర్తిస్థాయిలో వార్తలు రాసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఐటీ నోటీసులు, జాతీయ మీడియా వార్తలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నోటీసులు ఫేక్ అయితే కనీసం ఆ విషయమైనా చంద్రబాబు చెప్పాలన్నారు.
2020లో ఓసారి, 2021లో మరోసారి ఐటీ రైడ్స్ జరిగాయని, మనోజ్ దేవ్, శ్రీనివాస్ ఇళ్లలో అప్పుడు తనిఖీ చేశారన్నారు. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ ద్వారా షెల్ కంపెనీలకు వెళ్లి, అక్కడి నుండి చంద్రబాబుకు నిధులు అందినట్లు ఐటీ శాఖ చెప్పిందన్నారు. ఈ విషయమై చంద్రబాబు, లోకేశ్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. నోటీసులపై చంద్రబాబు పదేపదే చెప్పే సాంకేతిక అంశాలు సమాధానాలు కావని చెప్పారు. ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు.
అసలు ఐటీ అడిగిన లంచాల వ్యవహారానికి సంబంధించిన దాని గురించి మాట్లాడకుండా కేవలం సాంకేతిక అంశాలపై మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇన్నేళ్ల చంద్రబాబు రాజకీయం అంతా ఇలాగే సాగిందన్నారు. ముడుపులు అందినట్లు పూర్తి సమాచారం ఉన్నందునే ఐటీ నోటీసులు ఇచ్చిందన్నారు. కొన్ని తరాల పాటు లబ్ధి పొందేలా చంద్రబాబు స్కామ్ చేశారన్నారు. అమరావతి విషయంలో తనతోపాటు తన వారంతా లాభం పొందేలా వ్యవహరించారన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్నారని స్వయంగా ప్రధాని చెప్పారన్నారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై సజ్జల
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనలపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. దీని ఆచరణలో చాలా సమస్యలు రావొచ్చునన్నారు. అమెరికా వంటి దేశంలో రెండే పార్టీలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైందని, కానీ బహుళ పార్టీలు కలిగిన భారత్‌లో అంత సులభం కాదన్నారు. చర్చలు, ఏకాభిప్రాయం ద్వారానే ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధించవచ్చునని చెప్పారు.