Vijayasai Reddy: చంద్రబాబుకు ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటిబొట్టు: విజయసాయిరెడ్డి

VijayaSaiReddy says RS 118 crores are very little to Chandrababu

  • అమరావతి స్కాంలో భాగస్వామిగా ఉన్న సింగపూర్ మంత్రి అరెస్టయ్యారని వెల్లడి
  • సీఆర్డీఏ అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్ళపై లక్షకోట్ల వ్యవహారాలు బయటకు రావాలని వ్యాఖ్య
  • తవ్వితీస్తే పదివేల అక్రమాలు బయటకు వస్తాయన్న విజయసాయిరెడ్డి

షెల్ కంపెనీల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికపై ట్వీట్ చేశారు. అమరావతి అనేది పెద్ద స్కామ్ అన్నారు. ఇందులో భాగస్వామిగా ఉన్న సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడన్నారు. సీఆర్డీఏ ప్లానింగ్‌లో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు బయటకు రావాల్సి ఉందన్నారు.

విజయసాయిరెడ్డి శనివారం వరుస ట్వీట్లతో టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు పొత్తు కోసం ఢిల్లీ వెళితే పాత ఐటీ కేసు మీడియా ద్వారా వెలుగు చూసిందని, తవ్వితీయాలే కాని ఇలాంటివి పదివేల అక్రమాలు బయటపడతాయని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఢిల్లీలో చక్రం తిప్పి చంద్రబాబు చేసిన పనులు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని, కేవలం తన సంపద పెంచుకోవడం కోసమే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా శ్రమించారని ఎద్దేవా చేశారు.

అమరావతి కాంట్రాక్టులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో కమీషన్‌గా తీసుకున్న 118 కోట్ల లెక్క చూపని ధనం గురించి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మీరు కటిక పేదవారు కనుకే కుప్పంలో రెండు గదుల చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు కదా అని చురకలు అంటించారు. విజనరీ అంటే దోచుకోవడంలో ఆరితేరడమా? అని ప్రశ్నించారు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.118 కోట్ల మొత్తాన్ని వెల్లడించని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపించిందని మరో ట్వీట్ చేశారు. 

వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన...

వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సానుకూల పరిణామమని, ఇలా ఎన్నికలు నిర్వహిస్తే కోట్లాది రూపాయలు ఆదా అవుతుందని పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఆలోచన కొత్తదేమీ కాదని, 1951-52, 1957, 1962, 1967లలో ఇలా జరిగిందన్నారు. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని, కాబట్టి ఆ ప్రభావం తమపై ఉండదన్నారు.

  • Loading...

More Telugu News