Rakesh Singh: ప్రియురాలు మోసం చేయడంతో మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు!
- 100 మంది మహిళలను ఆన్ లైన్ లో బోల్తా కొట్టించిన రాకేశ్ సింగ్
- లక్షల రూపాయలు దోచుకున్న వైనం
- గతంలో ఓ యువతితో ప్రేమ వ్యవహారం
- ఆమె కోసం రూ.1.5 లక్షలు ఖర్చుపెట్టిన రాకేశ్ సింగ్
- రాకేశ్ సింగ్ ను వదిలి వెళ్లిపోయిన యువతి
దేశంలో దాదాపు 100 మహిళలను బ్లాక్ మెయిల్ చేసి, లక్షలాది రూపాయలు దోచుకున్న రాకేశ్ సింగ్ అనే వ్యక్తిని వడోదర సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. విచారణలో రాకేశ్ సింగ్ చెప్పిన విషయాలతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఎనిమిదేళ్ల కిందట రాకేశ్ సింగ్ ఓ యువతిని ప్రేమించాడు. ఆమెను సంతోషపెట్టేందుకు రూ.1.5 లక్షలు ఖర్చు చేశాడు. కానీ ఆ అమ్మాయి అతడిని మోసం చేసి వెళ్లిపోయింది. దాంతో రాకేశ్ సింగ్ మహిళలందరిపైనా ద్వేషం పెంచుకున్నాడు. అప్పటి నుంచి మహిళలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడడం మొదలుపెట్టాడు.
మ్యాట్రిమొని వెబ్ సైట్ల ద్వారా మహిళలకు వల విసిరేవాడు. విడాకులు తీసుకుని నూతన భాగస్వామి కోసం వెదుకుతున్న మహిళలను ఎక్కువగా టార్గెట్ చేసేవాడు. బాగా పరిచయం అయ్యాక, వారితో సాన్నిహిత్యం పెంచుకుని వారి నగ్న చిత్రాలను పంపించాలని కోరేవాడు. కొందరు అతడు చెప్పినట్టే చేసేవారు. అక్కడ్నించి అతడి దోపిడీ మొదలయ్యేది.
కొందరిని బెదిరించి, కొందరికి ఉద్యోగాల ఆశ చూపి లక్షలు రాబట్టుకునేవాడు. తనను తాను బిజినెస్ మేన్ గా, కార్పొరేట్ ప్రొఫెషనల్ గా, సీనియర్ పోలీస్ అధికారిగా పరిచయం చేసుకునేవాడు. కొందరు మహిళలతో తాను జడ్జినని కూడా చెప్పుకునేవాడని పోలీసులు వెల్లడించారు.
మహిళలను నమ్మించడంలో అతడు ఆరితేరాడని వివరించారు. ఆన్ లైన్ లో కొందరు మహిళలను నమ్మించేందుకు తనను తాను ఓ మహిళగా పరిచయం చేసుకునేవాడని, వాట్సాప్ డీపీ స్టేటస్ లో ఓ మహిళా పోలీసు అధికారి ఫొటో పెట్టేవాడని పేర్కొన్నారు.
మహిళల నుంచి రాబట్టిన డబ్బును విలాసాలకు ఉపయోగించేవాడని, ఖరీదైన హోటళ్లలో దిగేవాడని, తరచుగా అమ్మాయిలను (ఎస్కార్ట్) వెంటేసుకుని తిరిగేవాడని తెలిపారు. అతడి బ్లాక్ మెయిలింగ్ తీవ్రతరం కావడంతో వడోదరకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్రంగా గాలించిన అనంతరం మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాకేశ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అతడు 10 వేర్వేరు ఈమెయిల్ ఐడీలు ఉపయోగించినట్టు గుర్తించారు. ప్రియురాలు చేసిన నమ్మకద్రోహం వల్లే తాను మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్టు అతడు విచారణలో వెల్లడించాడు.