Nalgonda District: త్వరలో నల్గొండలో ఐటీ హబ్ ప్రారంభం: మంత్రి కేటీఆర్
- ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తున్నాయన్న కేటీఆర్
- వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, సిద్దిపేట, నిజామాబాద్ తర్వాత నల్గొండలో..
- రూ.98 కోట్లతో ఐటీ హబ్ కోసం భవన నిర్మాణం
త్వరలో నల్గొండలో ఐటీ హబ్ ప్రారంభమవుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మరికొన్ని వారాల్లో ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్ తర్వాత మరో ద్వితీయ శ్రేణి నగరమైన నల్గొండలో ఐటీ హబ్ ప్రారంభం కాబోతుందన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో రూ.98 కోట్లతో ఐటీ హబ్ కోసం భవనం నిర్మితమైంది. త్వరలో ఐటీ హబ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటీవల మెగా కొలువుల మేళానూ నిర్వహించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి దాదాపు పదిహేను వేలమంది అభ్యర్థులు హాజరయ్యారు.