KVP: రఘువీరారెడ్డితో కలిసి పుస్తకం రాసిన కేవీపీ... ఆవిష్కరించిన దిగ్విజయ్ సింగ్
- వైఎస్ పై ఇప్పటిదాకా నాలుగు పుస్తకాలు తీసుకువచ్చిన కేవీపీ
- రఘువీరాతో కలిసి 'రైతే రాజైతే' పుస్తకాన్ని రచించిన వైనం
- హైదరాబాదులో పుస్తకావిష్కరణ కార్యక్రమం
- ముఖ్య అతిథిగా దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవీపీని వైఎస్సార్ ఆత్మ అంటుంటారు. ఈ నేపథ్యంలో, కేవీపీ తన మిత్రుడు వైఎస్సార్ పై పలు పుస్తకాలు రచించారు.
తాజాగా 'రైతే రాజైతే' అనే పుస్తకాన్ని కేవీపీ... కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డితో కలిసి రచించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ పై తాను నాలుగు పుస్తకాలు తీసుకువచ్చానని, వాటిలో మూడింటిని దిగ్విజయ్ సింగే ఆవిష్కరించారని వెల్లడించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నది వైఎస్ ఆకాంక్ష అని, దాన్ని మనం నిజం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో వైఎస్ ఎలా ముందుకు వెళ్లాడో, అలాగే వెళితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తథ్యమని అన్నారు. తనను ఆంధ్రా వాడు అనుకోవద్దని, తన ఓటు తెలంగాణలోనే ఉందని, తాను తెలంగాణ మట్టిలోనే కలిసిపోతానని కేవీపీ స్పష్టం చేశారు. వైఎస్ పథకాలను, ఆయన ఆలోచనలను పుస్తకంలో పేర్కొన్నానని, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం వాటిని నచ్చితే పరిశీలించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.