Telangana Assembly Election: ఇప్పటికే 25 నియోజకవర్గాల అభ్యర్థులపై స్పష్టత.. మరో 94 నియోజకవర్గాలపై కసరత్తు చేస్తున్న రేవంత్ బృందం
- తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
- అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టిన కాంగ్రెస్
- పీఈసీ చైర్మన్ రేవంత్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల భేటీ
- 1,006 దరఖాస్తుల పరిశీలన
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసి అన్ని పార్టీల కంటే ముందు ఎన్నికల సన్నద్ధత చాటుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికపై తొందరపడుతోంది.
ఈ క్రమంలో, హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ (ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ) భేటీ అయింది. ఈ సమావేశానికి 29 మంది కమిటీ సభ్యులు హాజరయ్యారు. టికెట్ ఆశావహుల వ్యక్తిగత సమాచారాన్ని పీఈసీ సభ్యులు పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మరో 94 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై రేవంత్ బృందం కసరత్తులు చేస్తోంది.
అభ్యర్థుల ఎంపికపై పార్టీ స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చే నివేదికను పీఈసీ సిద్ధం చేయనుంది. అందుకోసం 1,006 దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో అధిష్ఠానానికి నివేదిక సమర్పించనున్నారు.