Nara Lokesh: దసరా వస్తే అందరూ ఆయుధ పూజ చేస్తారు... జగన్ మాత్రం...!: నారా లోకేశ్
- ఉంగుటూరు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
- గణపవరంలో బహిరంగ సభ
- సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించిన లోకేశ్
- జగన్ సినిమాల్లో నటిస్తే భాస్కర్ అవార్డు ఖాయమని వ్యంగ్యం
జగన్ అందరిని పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు... కానీ జగనే పెద్ద డ్రామా ఆర్టిస్టు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జగన్ సినిమాల్లో నటిస్తే భాస్కర్ అవార్డ్ ఖాయం అని వ్యంగ్యం ప్రదర్శించారు. దసరా వస్తే అందరూ ఆయుధపూజ చేస్తారని, జగన్ మాత్రం కోడికత్తి పూజ చేస్తాడని ఎద్దేవా చేశారు.
బాబాయ్ మర్డర్ లానే కోడికత్తి ఎపిసోడ్ జగన్ నాటకం అని తేలిపోయిందని స్పష్టం చేశారు. కోడికత్తితో పొడిచింది శ్రీను కాదు బొత్స మేనల్లుడు చిన్న శ్రీను అని న్యాయవాది అసలు విషయం బయటపెట్టాడని లోకేశ్ వెల్లడించారు.. జగన్ అధికారం కోసం కోడికత్తి డ్రామా చేసి ఒక దళితుడి జీవితంతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో లోకేశ్ బహిరంగ సభలో ప్రసంగించారు.
జగన్ దరిద్ర పాదంతో వరుణుడు పరార్!
జగన్ ది దరిద్ర పాదం. ఆయన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రాన్ని దరిద్రం వెంటాడుతోంది. 122 ఏళ్ల తరువాత అత్యంత తక్కువ వర్షపాతం జగన్ పాలనలో నమోదు అయ్యింది. ఆగస్టు నెలలో 32 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జగన్ ను చూసి వరుణ దేవుడు కూడా పారిపోయాడు.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం, కచ్చులూరు బోటు ప్రమాదం, కరోనా వచ్చి వేలాది మంది చనిపోవడం వరకూ ఎన్నో ఘటనలు మనం చూశాం. ఇప్పుడు వర్షాలు కూడా లేవు.
హంతకులంటే సైకో జగన్ కి ఇష్టం
హంతకులంటే సైకో జగన్ కు చాలా ఇష్టం. లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్ బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. బాబాయ్‌ని చంపిన తమ్ముడు అవినాష్ రెడ్డిని ఎంపీని చేశాడు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని సన్మానించాడు. కోడికత్తితో పొడిచిన బొత్స మేనల్లుడు చిన్నశ్రీనుని జెడ్పీ చైర్మన్ చేశాడు.
కోడికత్తి గాయానికి కుట్లేసిన సాంబశివారెడ్డికి కేబినెట్ ర్యాంక్ పదవి గిఫ్ట్ ఇచ్చాడు. కోడికత్తి జగన్ నాటకానికి బలైన దళితుడైన జనిపల్లి శ్రీనుకు మాత్రం బెయిల్ రాకుండా చేశాడు. కోడికత్తి ఎపిసోడ్ డ్రామా కాబట్టే జగన్ కోర్టుకి కూడా వెళ్లడం లేదు. జగన్ డ్రామా ప్రజలకు అర్ధం అయ్యింది.
నన్ను ఆపేవాడు పుట్టలేదు
మనం ఒక్కో అడుగు వేస్తుంటే తాడేపల్లి ప్యాలస్ లో టీవీలు పగిలిపోతున్నాయి. యువగళం 200 రోజులు దాటింది. జగన్ కోరిక మాత్రం తీరలేదు. ఒక్క రోజైనా మీ లోకేశ్ ని అడ్డుకోవాలి, పాదయాత్ర ఎలా అయినా ఆపాలని సైకో కోరిక. పోలీసుల్ని పంపాడు మనం తగ్గేదేలేదు అన్నాం.
నా సౌండ్ వెహికల్ లాక్కున్నాడు. ఇది స్వర్గీయ ఎన్టీఆర్ గారి గొంతు, ఆపే మగాడు పుట్టలేదు, పుట్టడు. రాళ్లు, గుడ్లు వెయ్యమని పిల్ల సైకోలను పంపాడు... మన వాళ్లు రిటర్న్ గిఫ్ట్ గా ఆమ్లెట్ వేసి పంపారు. ఇప్పుడు రెచ్చగొట్టే ఫ్లెక్సీలు వేస్తున్నారు. పోలీసుల్ని చూస్తుంటే నాకు బాధేసింది. వైసీపీ బ్యానర్లకు కాపలా పెట్టాడు.
మేము ఫ్లెక్సీలు వేస్తే నీకు మైడ్ బ్లాంక్
మేము ఫ్లెక్సీలు వెయ్యడం స్టార్ట్ చేస్తే నీకు మైండ్ బ్లాంక్ అవుతుంది. హూ కిల్డ్ బాబాయ్, అమ్మ, చెల్లిని గెంటేసింది ఎవరు? లక్ష కోట్లు దోచేసిన గజదొంగ అని ఫ్లెక్సీలు వెయ్యమంటావా? బాంబులకే భయపడం... ఫ్లెక్సీలకు భయపడతామా? భయం మా బ్లడ్ లో లేదు సైకో జగన్.
వైసీపీ సిల్లీ ఫెలోస్ కి మరోసారి చెబుతున్నా. చిల్లర వేషాలు వద్దు. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం...మీ లోకేష్ ది అంబేద్కర్ రాజ్యాంగం. నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే వైసీపీకి అంతిమయాత్ర.
ఐదుగురు మంత్రులయ్యారు... దేనికి!
జగన్ వచ్చాక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుండి ఐదుగురు మంత్రులు అయ్యారు. ఒకరు ఆళ్ల నాని. సొంత ఊరిలో ప్రజల ఆరోగ్యం కాపాడలేని వైద్య మంత్రి. ఆయన పదవి పోయింది. శ్రీరంగనాధ రాజు గృహ నిర్మాణ శాఖ మంత్రి. ఆయన హయాంలో ఒక్క ఇల్లు కట్టలేని మంత్రిగా మిగిలిపోయాడు. పదవిపోయింది.
ఇంకో మంత్రి ఎర్రిపప్ప మంత్రి. సివిల్ సప్లైస్ మంత్రి. ధాన్యం ఎప్పుడు కొంటారు అని ఒక రైతు అడిగితే ఎర్రిపప్ప అని తిడతాడు. హోంమంత్రి తానేటి వనిత. పాపం ఆవిడను ఇంటికే పరిమితం చేశారు. శాఖలో బదిలీలు కూడా ఆమెకు తెలియకుండా జరిగిపోతాయి. మరో మంత్రి కొట్టు సత్యనారాయణ. దేవాదాయ శాఖ. ఆయన కొట్టేయడంలో ఎక్స్ పర్ట్.
******************
ఇవాళ ఉంగుటూరు నియోజకవర్గంలో లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. 203వ రోజు చిననిండ్రకొలను నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెదనిండ్రకొలను, నిడమర్రు, భువనపల్లి, గణపవరం మీదుగా ఉండి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు నేతృత్వంలో యువనేత లోకేశ్ కు ఘనస్వాగతం లభించింది.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2775.2 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 22.5 కి.మీ.*
*204వరోజు (4-9-2023) యువగళం వివరాలు*
*ఉండి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)*
ఉదయం
8.00 – కోలమూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – కోలమూరు సెంటర్ లో స్థానికులతో సమావేశం.
9.15 – పాములపర్రు ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.
11.00 – ఉండి సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
11.30 – ఉండి అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.
మధ్యాహ్నం
12.00 – ఉండి కోట్ల ఫంక్షన్ హాలు వద్ద భోజన విరామం.
సాయంత్రం
3.00 – ఉండి కోట్ల ఫంక్షన్ హాలులో ఆక్వారైతులతో ముఖాముఖి.
4.00 – ఉండి కోట్ల ఫంక్షన్ హాలు వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.30 – పాదయాత్ర భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
6.00 – భీమవరం శ్రీరామ ఆటోమొబైల్స్ వద్ద విడిది కేంద్రంలో బస.
******