Bangladesh: ఆసియా కప్ లో బంగ్లాదేశ్ గెలుపు బోణీ

Bangladesh beat Afghanistan by 89 runs in Asia Cup

  • ఆఫ్ఘనిస్థాన్ పై 89 పరుగుల తేడాతో నెగ్గిన బంగ్లాదేశ్
  • తొలుత 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసిన బంగ్లాదేశ్
  • ఛేదనలో 44.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైన ఆఫ్ఘనిస్థాన్
  • ఆసియా కప్ లో సోమవారం టీమిండియా, నేపాల్ ఢీ

ఆసియా కప్ లో ఆదివారం నాడు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గ్రూప్-బిలో భాగంగా జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్ జట్టు  89 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ ను ఓడించింది. తద్వారా టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. తన మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక చేతిలో ఓడిపోవడం తెలిసిందే. 

ఇవాళ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆల్ రౌండ్ షో కనబర్చింది. పాకిస్థాన్ లోని లాహోర్ లో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించింది. మెహెదీ హసన్ మిరాజ్ (112), నజ్ముల్ హుస్సేన్ శాంటో (104) సెంచరీలు సాధించగా... నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. 

ఇక, భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ 44.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 75 పరుగులతో రాణించాడు. కెప్టెన్  హష్మతుల్లా షాహిది 51, రహ్మత్ షా 33, రషీద్ ఖాన్ 24 పరుగులు చేశారు. రన్ రేట్ మెరుగ్గానే ఉన్నప్పటికీ వికెట్లు కోల్పోవడంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4, షోరిఫుల్ ఇస్లామ్ 3, హసన్ మహ్మూద్ 1, మెహెదీ హసన్ 1 వికెట్ తీశారు. 

ఆసియా కప్ లో రేపు (సెప్టెంబరు 4) టీమిండియా, నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో జరగనుంది.

  • Loading...

More Telugu News