M. Kodandaram: ప్రొఫెసర్ జయశంకర్‌ను కేసీఆర్ క్షోభపెట్టారు.. ఆయనతో వేగలేమని అప్పుడే తెలిసింది: ప్రొఫెసర్ కోదండరాం
- ప్రొఫెసర్ జయశంకర్‌కు ఎంపీ టికెట్ ఇస్తామని ఆశపెట్టి ఇవ్వలేదన్న కోదండరాం
- కేసీఆర్ ఏ పనిచేసినా అందులో ఎంత మిగులుతుందని లెక్కలు వేసుకుంటారన్న జనసమితి అధ్యక్షుడు
- తప్పుడు డిజైన్ వల్ల కాళేశ్వరంలో రూ. 7 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణ
- తనను విమర్శించడమంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని ప్రచారం చేశారని వ్యాఖ్య
- కేసీఆర్‌కు హిట్లర్ అంటే ఎంతో ఇష్టమని కామెంట్
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌ను కేసీఆర్ మానసిక క్షోభకు గురిచేశారని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ తనకంటే ఎక్కువగా ప్రొఫెసర్ జయశంకర్‌కే ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు. ఆయనకు లోక్‌సభ టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా క్షోభకు గురిచేశారన్నారు.
కేసీఆర్‌తో వేగలేమని ఉద్యమ సమయంలోనే తనకు అర్థమైందని అన్నారు. కేసీఆర్‌ది ఫ్యూడల్ పాలన, ఆధిపత్యం మాత్రమేనని అనుకున్నామని కానీ, నాలుగైదేళ్ల తర్వాత తన అధికారాన్ని వనరులను కొల్లగొట్టేందుకు వాడుకుంటున్నట్టు తెలిసిందన్నారు. 2018 తర్వాత పింఛన్లు, రేషన్ కార్డులు తప్ప ధరణి సహా ఏ పని చేపట్టినా అందులో ఎంత మిగులుతుందని కేసీఆర్ లెక్కలు వేసుకునేవారని అన్నారు.
ప్రజలిచ్చిన అధికారాన్ని సొంతానికి వాడుకోవడం, వనరులు కొల్లగొట్టడానికి ఉపయోగించుకుంటున్నట్టు గ్రహించడానికి తమకు ఐదారేళ్లు పట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా డబ్బు చుట్టూనే తిరిగిందని, నాగం జనార్దన్‌రెడ్డి లెక్కల ప్రకారం తప్పుడు డిజైన్ వల్ల రూ. 7 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. నిరసనలు ఎవరు చేసినా అణచివేయడం, అరెస్ట్ చేయడమే కేసీఆర్ పని అని, తనను 15-20 సార్లు అరెస్ట్ చేశారని తెలిపారు.
కేసీఆర్‌కు హిట్లర్ రోల్‌మోడల్ అని, ఆయన ఆత్మకథ ‘మీన్‌క్యాంఫ్’ కేసీఆర్‌కు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తెలంగాణ అంటే తానేనని, తనవల్లే వచ్చిందని, తనను ప్రశ్నించడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమనే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారని, ప్రజల్లో కేసీఆర్‌పై చాలా వ్యతిరేకత ఉందని కోదండరాం ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.