Organ Donation: హైదరాబాద్ వివాహిత అవయవదానంతో నలుగురికి పునర్జన్మ
- తలనొప్పితో కుప్పకూలిన మహిళ.. బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించిన వైద్యులు
- కుటుంబ సభ్యులతో మాట్లాడిన జీవన్ దాన్ వైద్య బృందం
- అవయవదానానికి అంగీకరించిన భర్త, బంధువులు
ఇంట్లో పనులు చేస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలిన వివాహితను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అందించినా స్పందించలేదు. వైద్య పరీక్షల తర్వాత డాక్టర్ల బృందం ఆమెను బ్రెయిన్ డెడ్ గా ప్రకటించింది. జీవన్ దాన్ ప్రతినిధులు అవయవదానం ఆవసరాన్ని వివరించడంతో బాధితురాలి కుటుంబం ఆర్గాన్ డొనేషన్ కు అంగీకరించింది. బాధితురాలు గుండ్ర హరిత (26) తాను చనిపోతూ మరో నలుగురికి పునర్జన్మ ఇచ్చింది.
ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన గుండ్ర హరిత భర్తతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు. హరిత భర్త యశ్వంత్ రెడ్డి ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు 10 నెలల చిన్నారి ఉంది. కాగా, గత నెల 29న హరిత ఇంట్లోనే కుప్పకూలిపోయింది. తలనొప్పిగా ఉందని చెబుతూనే కింద పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సికింద్రాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చి వైద్యులు చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్సకు హరిత సహకరించకపోవడంతో వైద్య పరీక్షలు నిర్వహించి బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు.
జీవన్ దాన్ ప్రతినిధులు హరిత భర్త, ఇతర కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో హరిత అవయవాలను దానం చేయడానికి ఆమె కుటుంబం అంగీకారం తెలిపింది. హరిత కిడ్నీలు, కాలేయం, లంగ్స్ సేకరించిన డాక్టర్లు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నలుగురికి వాటిని అమర్చినట్లు తెలిపారు. హరిత చనిపోయినా ఆ నలుగురి రూపంలో బతికే ఉంటుందని చెప్పారు.