annamalai: ఉదయనిధి స్టాలిన్‌కు బీజేపీ నేత అన్నామలై చురకలు!
- సనాతన ధర్మాన్ని కోట్లాదిమంది ప్రజలు పాటిస్తున్నారన్న అన్నామలై
- ముందు మీ అమ్మను గుడికి వెళ్ళకుండా ఆపాలని సవాల్
- భగవద్గీతను బహుమతిగా పంపిస్తానన్న బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు
- హెచ్ఆర్ అండ్ సీఈ మంత్రి 10వ తేదీలోగా రాజీనామా చేయాలని డిమాండ్
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ పలుచోట్ల పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు.
ఈ క్రమంలో అన్నామలై మాట్లాడుతూ... సనాతన ధర్మాన్ని కోట్లాదిమంది ప్రజలు పాటిస్తున్నారని, మంచి చెప్పే అలాంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే వ్యాఖ్యలు సరికాదన్నారు. ఒకవేళ అలా చేయాలనుకుంటే ముందు నీ తల్లిని గుడికి వెళ్లకుండా ఆపాలన్నారు. 'నేను అతనికి సవాల్ చేస్తున్నాను... మీ తల్లిని గుడికి వెళ్లకుండా ఆపు' అన్నారాయన. ఉదయనిధి స్టాలిన్‌కు తాను ఓ భగవద్గీతను బహుమతిగా పంపిస్తానని, దానిని చదివి అర్థం చేసుకోవాలని హితవు పలికారు. సనాతన ధర్మం క్రైస్తవం, ఇస్లాం కంటే ముందే ఉన్నాయన్నారు.
ఉదయనిధి పాల్గొన్న సమావేశంలోనే డీఎంకే నేత తిరు కే వీరమణి, హెచ్ఆర్ అండ్ సీఈ మంత్రి శేఖర్ బాబు పాల్గొన్నారని, ఉదయనిధి హిందూ ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే వారు కనీసం మాట్లాడలేదని అన్నామలై ట్వీట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఓ సమావేశంలో సనాతన ధర్మమన్నా హిందూ ధర్మమన్నా ఒకటేనని వీరమణి చెప్పారని గుర్తు చేశారు.
కానీ ఉదయనిధి అలా మాట్లాడుతుంటే అదే సమావేశంలో పాల్గొన్న మంత్రి శేఖర్ బాబు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని, కాబట్టి హెచ్ఆర్ అండ్ సీఈ మంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఆయనకు లేదని, ఈ నెల 10వ తేదీ లోపు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తక్షణమే రాజీనామా చేయకుంటే 11 సెప్టెంబర్ నుండి తమిళనాడు బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకుంటాయని హెచ్చరించారు.