Harish Rao: జమిలి ఎన్నికల కమిటీలో దక్షిణాది వారికి చోటు లేకుండా చేశారు: మంత్రి హరీశ్ రావు
- బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీశ్ రావు ఫైర్
- దక్షిణాదిపై బీజేపీకి ఎందుకంత చిన్నచూపు అంటూ ఆగ్రహం
- బీజేపీ ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలంటోందని వ్యంగ్యం
- డిక్లరేషన్ లు అంటూ నాటకాలు ఆడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపై విమర్శలు
తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. జనగామలో ఆయన మాట్లాడుతూ, దక్షిణాదిపై బీజేపీకి ఎందుకంత చిన్నచూపు? అని మండిపడ్డారు.
బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే జమిలి ఎన్నికలు అంటోందని ఎద్దేవా చేశారు. దక్షిణాదిలో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ వివక్ష చూపుతోందని విమర్శించారు. జమిలి ఎన్నికల కమిటీలో దక్షిణాది వారికి చోటు లేకుండా చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఢిల్లీలో కీలక శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు.
కొందరు డిక్లరేషన్ లు అంటూ నాటకాలకు తెరలేపారని కాంగ్రెస్ నేతలపై హరీశ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు డిక్లరేషన్ ఇచ్చారని స్పష్టం చేశారు. చెల్లని రూపాయికి గీతలెక్కువ అన్నట్టు... గెలవని కాంగ్రెస్ కు హామీలెక్కువ అని వ్యంగ్యం ప్రదర్శించారు.
ఛత్తీస్ గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, కానీ వికలాంగుల పెన్షన్ రూ.1000 మాత్రమేనని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ముగిసిపోతుందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరంతరాయ విద్యుత్ కు కోత పడుతుందని అన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.