DK Aruna: డీకే అరుణ ఎమ్మెల్యేగా ఎంపికైనట్లు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
- గద్వాల నుండి డీకే అరుణ గెలిచినట్లు ఇటీవల హైకోర్టు తీర్పు
- డీకే అరుణను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ప్రకటించాలని సీఈసీ లేఖ
- రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ సీఈవోకు ఈసీ అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ పంపించారు. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
గత ఎన్నికల్లో గద్వాల నుండి కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. డీకే అరుణ రెండో స్థానంలో నిలిచారు. నామినేషన్ సందర్భంగా తప్పుడు వివరాలు సమర్పించడంతో కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు శిక్షగా రూ.2.50 లక్షలు జరిమానా విధించింది. ఖర్చుల కింద పిటిషన్ దాఖలు చేసిన డీకే అరుణకు రూ.50వేలు చెల్లించాలని తీర్పు చెప్పింది. డీకే అరుణను 2018 డిసెంబర్ 12 నుండి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.