Revanth Reddy: అది నెట్ ప్రాక్టీస్! పార్టీలోని అంతర్గత గొడవపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- పార్టీలోని అంతర్గత గొడవ నెట్ ప్రాక్టీస్ వంటిదన్న టీపీసీసీ చీఫ్
- కాంగ్రెస్‌లో ఎవరైనా టిక్కెట్ అడగవచ్చునన్న రేవంత్ రెడ్డి
- తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వ్యాఖ్య
- సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత గొడవ నెట్ ప్రాక్టీస్ వంటిది అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము నెట్ ప్రాక్టీస్ చేసి, ఎదుటివాడిపై (పార్టీపై) గట్టిగా ఫైట్ చేస్తామని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా టిక్కెట్ అడగవచ్చునని చెప్పారు. ఈ నెల 6న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు రానున్నట్లు వెల్లడించారు. బోయినపల్లిలోని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తామన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. భాగ్యనగరం వేదికగా ఈ నెల 16, 17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీడబ్ల్యుసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏఐసీసీకి గతంలో లేఖ రాసినట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాటి హైదరాబాద్ సంస్థానానికి చెందిన వ్యక్తి అని, రజాకార్ల చేతిలో ఖర్గే కుటుంబం చనిపోయిందన్నారు.
తెలంగాణ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలపై సీడబ్ల్యుసీలో చర్చిస్తామన్నారు. 16న తాజ్ కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని, 17న పరేడ్ గ్రౌండ్లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ కార్యక్రమం ప్రారంభిస్తామని, 18న గ్యారంటీ స్కీమ్‌లపై ప్రచారం చేస్తామన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, పొత్తులు, వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నిర్ణయాలు తీసుకోనుందన్నారు. I.N.D.I.A. కూటమి గెలుపుకు అవసరమైన వ్యూహం తెలంగాణలోనే రూపొందుతుందన్నారు.
రేవంత్-జగ్గారెడ్డి చెట్టాపట్టాల్
గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తూనే పాతవారికీ టిక్కెట్లు ఇవ్వాలన్నారు. జనగామ జిల్లాలో పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ నేతకు టిక్కెట్ ఇవ్వకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు.