Mamata Banerjee: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన మమతా బెనర్జీ
- అతను జూనియర్.. ఎందుకు మాట్లాడాడో తెలియదన్న మమతా బెనర్జీ
- ప్రతి మతానికి సమాన గౌరవం ఇవ్వాలని హితవు
- ఏ మతమైనా వారి మనోభావాలు దెబ్బతీయకూడదన్న బెంగాల్ సీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఏ వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలను అంగీకరించలేమని తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.... ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల విషయానికి వస్తే అతను ఓ జూనియర్ అని, అతను ఎందుకు అలా మాట్లాడాడో తెలియదన్నారు. కానీ మనం ప్రతి మతానికి సమాన గౌరవం ఇవ్వాలన్నారు.
తమిళనాడు, దక్షిణ భారతదేశ ప్రజలను తాను గౌరవిస్తానని, కానీ ఏ మతమైనా మనోభావాలు దెబ్బతీయడం సరికాదన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని వ్యాఖ్యానించారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమన్నారు. సనాతన ధర్మాన్ని తాను గౌరవిస్తానని, వేదాల నుండి ఎంతో నేర్చుకుంటామన్నారు. బెంగాల్‌లో చాలామంది పురోహితులు ఉన్నారని, వారికి పింఛన్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వేలాది దేవాలయాలు ఉన్నాయన్నారు. దేవాలయం, చర్చి, మసీదు అన్ని చోట్లకూ తాము వెళ్తామన్నారు.