Goat Pepper: మిర్చి ఘాటుకు ఆర్నెల్లుగా ఆసుపత్రిలోనే మహిళ
- బ్రెజిల్ లో అత్యంత ఘాటైన మిర్చి... గోట్ పెప్పర్
- ముక్కు వద్ద ఉంచుకుని వాసన చూసిన మహిళ
- మెదడు వాచిపోయిన వైనం
- ఆసుపత్రి నుంచి రెండుసార్లు డిశ్చార్జి అయినా తిరగబెట్టిన అనారోగ్య సమస్యలు
- మళ్లీ ఆసుపత్రిలో చేరిక... ఎప్పటికి కోలుకుంటుందో చెప్పలేమన్న వైద్యులు
భూత్ జోలోకియా... భారత్ లో అత్యంత ఘాటైన మిర్చి రకం. దీని ప్రభావం మామూలుగా ఉండదు. సరిగ్గా ఇలాంటి పవర్ ఫుల్ మిరపకాయలు బ్రెజిల్ లోనూ లభ్యమవుతాయి. వీటిని గోట్ పెప్పర్ అంటారు. వీటి ఘాటు ఊహించలేం. అందుకు ఈ బ్రెజిల్ మహిళ ఉదంతమే నిదర్శనం.
అనాపోలిస్ పట్టణానికి చెందిన థాయిస్ మెదీరోస్ డి ఒలివెరా అనే మహిళ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓ విందుకు వంటకాలు సిద్ధం చేస్తోంది. ఆమె బాయ్ ఫ్రెండ్ తల్లిదండ్రులు ఆ విందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓ వంటకం కోసం తీసుకువచ్చిన మిరపకాయలను థాయిస్ ముక్కు వద్ద ఉంచుకుని వాసన చూసింది. ఈ క్రమంలో ఆ మిరపకాయలు ఆమె ముక్కుకు రుద్దుకోవడంతో వెంటనే విపరీతమైన దుష్ప్రభావం కనిపించింది.
ఆ ఘాటుకు ఆమెకు నోట మాట పడిపోయింది, కనీసం రెండడుగులు కూడా వేయలేకపోయింది. గోట్ పెప్పర్ ఘాటు 15 వేల నుంచి 30 వేల స్కొవిల్లే యూనిట్లు ఉంటుంది. మిర్చి, మసాలా ఘాటును కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం స్కొవిల్లే యూనిట్.
ఇంత ఘాటైన మిర్చిని వాసన చూసే సరికి థాయిస్ మెదడు వాచిపోయింది. గొంతు పూడుకుపోయింది. వెంటనే ఆమెను అనాపోలిస్ పట్టణంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమె సొంత పట్టణం గోనియాలోని మరో ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షలు నిర్వహించగా, గోట్ పెప్పర్ మిరపకాయలతో థాయిస్ కు తీవ్రమైన అలర్జీ కలిగినట్టు నిర్ధారణ అయింది. శరీర కణజాలాల్లో ద్రవాలు ఉత్పత్తి అయితే వాపు సంభవించడం తెలిసిందే. అదే విధంగా ఆ బ్రెజిల్ మహిళకు మెదడులో వాపు సంభవించింది. నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె జులై 31న డిశ్చార్జి అయింది.
అయితే ఇంటికి తీసుకువచ్చిన వెంటనే తీవ్ర జ్వరం, మూత్రంలో రక్తం వంటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడింది. దాంతో ఆమెను మళ్లీ ఆసుపత్రిలో చేర్చారు. ఆగస్టు 10న డిశ్చార్జి కాగా, మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు బిగుసుకుపోయాయి. దాంతో థాయిస్ ఆరోగ్యం క్షీణించింది.
ఈ నేపథ్యంలో మరోసారి ఆసుపత్రిలో చేరక తప్పలేదు. ఆమె ఎప్పటికీ పూర్తిగా కోలుకుంటుందో చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.