Team India: అంచనాలకు మించి బ్యాటింగ్ చేసిన నేపాల్ ఆటగాళ్లను సత్కరించిన టీమిండియా
- నిన్న ఆసియా కప్ లో భారత్, నేపాల్ ఢీ
- నేపాల్ పై ఘనంగా గెలిచిన భారత్
- మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన నేపాల్
- నేపాల్ ఆటగాళ్లను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో మెడల్స్ అందించిన టీమిండియా
ఆసియా కప్ లో నిన్న టీమిండియా, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో టీమిండియానే గెలిచినప్పటికీ, నేపాల్ బ్యాటింగ్ చేసిన తీరు విమర్శకులను సైతం ఆకట్టుకుంది.
ప్రపంచంలోనే బలమైన బౌలింగ్ వనరులున్న జట్లలో టీమిండియా ఒకటి. అలాంటి జట్టును ఎదుర్కొని ఓ పసికూన జట్టు 200కి పైగా పరుగులు చేయడం మామూలు విషయం కాదు. పైగా 48 ఓవర్ల పాటు సిరాజ్, షమీ, జడేజా, కుల్దీప్ వంటి హేమాహేమీలైన టీమిండియా బౌలర్లను కాచుకోవడం నేపాల్ వంటి అనుభవంలేని జట్టుకు చాలా కష్టమైన పని.
ఈ మ్యాచ్ లో నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. నేపాల్ ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రదర్శన టీమిండియాను కూడా ఆకట్టుకుంది. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది నేపాల్ ఆటగాళ్లను మెడల్స్ తో సత్కరించారు. హార్దిక్ పాండ్యా, కోహ్లీ, ద్రావిడ్ తదితరులు నేపాల్ ఆటగాళ్ల మెడలో పతకం వేసి, భవిష్యత్తులోనూ ఇదే తరహాలో మెరుగైన ఆటతీరు కనబర్చాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టీమిండియా సుహృద్భావ చర్యను నెటిజన్లు అభినందిస్తున్నారు.