Vijayasai Reddy: చంద్రబాబు అండ్ కంపెనీకి తెలిసింది ఇదే!: విజయసాయిరెడ్డి
- చంద్రబాబుకు ఐటీ నోటీసులు
- విమర్శల దాడి కొనసాగిస్తున్న విజయసాయిరెడ్డి
- బాబు ఆలోచన అధికారం చుట్టూనే తిరుగుతుందని వెల్లడి
- దేశంలోని హవాలా ఆపరేటర్లు చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తారని ఆరోపణ
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసుల నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన విమర్శల దాడి పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అధికారం ఉంటే ప్రజలకు సేవ చేయడం ద్వారా నాలుగు కాలాల పాటు చరిత్రలో నిలిచిపోవచ్చని రాజకీయాల్లో ఉన్న వాళ్లు ఆశపడతారని, కానీ చంద్రబాబు అండ్ కంపెనీకి మాత్రం అధికారం ఉంటే యథేచ్ఛగా దోచుకోవడమే తెలుసని పేర్కొన్నారు. అక్రమ సంపాదనను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా పవర్ చేతిలో ఉండాలి... బాబు ఆలోచన దీని చుట్టే తిరుగుతుందని తెలిపారు.
"కేంద్రం వద్ద ఐటీ విభాగం ఉంటే భయపడతానా... ఒక్క రోజులో స్టే తెచ్చుకుంటా... ఎన్ని నోటీసులు ఇస్తారో ఇచ్చుకోండి అని గట్టిగా అరవాలనుకుంటాడు. కానీ వార్నింగ్ లైట్ వెలిగి సైలెంట్ అయిపోతాడు. గోల చేస్తే ఇంకెన్ని అక్రమాలు బయటికి తీస్తారో అనే వణుకు నోటికి తాళం వేసింది.
దేశంలోని హవాలా ఆపరేటర్లందరూ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తారు. వాళ్లెవరైనా డబ్బుతో పట్టుబడితో తనకున్న పలుకుడితో వారిని విడిపిస్తాడు. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి రూ.118 కోట్లు కమీషన్ తీసుకున్నట్టు ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులో షెల్ కంపెనీల ప్రతినిధులుగా పేర్కొన్న పేర్లన్నీ హవాలా ఆపరేటర్లవే" అని విజయసాయిరెడ్డి వివరించారు.