Kazipet: ఆమె ఫొటోను డీపీగా పెట్టుకోవడం తప్ప నేనేపాపం చేయలేదు... లేఖరాసి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
- కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో ఘటన
- మహిళ ఫిర్యాదుతో సస్పెండ్ చేసి ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయానికి బదిలీ చేసిన అధికారులు
- మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య
- అంతకుముందు ఆత్మహత్యకు కారణం చెబుతూ వీడియో రికార్డింగ్
- నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చిన పోలీసులు
కాజీపేటలో ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య ఉద్రిక్తతలకు కారణమైంది. తన ఆత్మహత్యకు తోటి రైల్వే ఉద్యోగి కె.దివ్యారెడ్డి, విఠల్‌రావు అనే అధికారి కారణమంటూ ఆత్మహత్యకు ముందు ఓ వీడియోను రికార్డు చేశాడు. దీంతో దోషులను శిక్షించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన పులి శంకరయ్య రైల్వే ఉద్యోగి. పదేళ్ల క్రితం ఆయనకు పక్షవాతం రావడంతో అన్‌ఫిట్‌గా పరిగణించి ఆయన కుమారుడు రవికుమార్‌కు రైల్వే ఉద్యోగం ఇచ్చారు. కుటుంబ సమస్యల కారణంగా వివాహం చేసుకోని ఆయన కొన్నేళ్లుగా కాజీపేట ఎలక్ట్రికల్ లోకోషెడ్‌లో టెక్నీషియన్-3గా పనిచేస్తూ ఈఎల్ఎస్ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు.
ఈ క్రమంలో తన సహోద్యోగి అయిన కె.దివ్యారెడ్డికి అవసరం నిమిత్తం దశలవారీగా రూ. 2.80 లక్షలు ఇచ్చాడు. షెడ్ ఉద్యోగులందరూ దివ్యారెడ్డితో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను రవికుమార్ తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఇది చూసిన దివ్యారెడ్డి అదే కార్యాలయంలో స్టెనో విఠల్‌రావుకు ఫిర్యాదు చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు రవికుమార్‌ను కొన్ని నెలల క్రితం సస్పెండ్ చేసి కాజీపేట ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయానికి బదిలీ చేశారు.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రవికుమార్ అక్కడ జాయిన్ కాలేదు. ఆదివారం రాత్రి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు.. అందరికీ నమస్కారమంటూ ఓ సూసైడ్ నోట్ రాసి, వీడియోను తన తమ్ముడు తిరుపతికి షేర్ చేశాడు. తన చావుకు దివ్యారెడ్డి, విఠల్‌రావే కారణమని అందులో పేర్కొన్నాడు. పదేళ్లుగా ఒక్క సెలవు కూడా పెట్టలేదని, తన వాట్సాప్‌లో దివ్యారెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకోవడం తప్ప తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నాడు. ఈ ఒక్క కారణంతో తనను వేధించారని, తన నుంచి డబ్బులు లాక్కున్నారని, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారని, దీంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు.
అది చూసి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన ఉండే క్వార్టర్స్‌లో చూడగా కనిపించలేదు. నిన్న తెల్లవారుజామున షెడ్లోని వీల్ట్రాక్లో రవికుమార్ మృతదేహాన్ని గుర్తించిన ఉద్యోగులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలిస్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి శిక్షిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. రవికుమార్ తమ్ముడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.