Rahul Gandhi: జీ20 సదస్సుకు ముందు.. యూరప్ పర్యటనకు రాహుల్‌గాంధీ
- వారం రోజులపాటు యూరప్‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ
- రేపు బెలారస్‌లో ఈయూ లాయర్లతో సమావేశం
- 8న పారిస్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం
- 11న తిరిగి భారత్ రాక
జీ20 సదస్సుకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారం రోజుల యూరప్ పర్యటనకు వెళ్లారు. అక్కడాయన యూరోపియన్ యూనియన్ (ఈయూ) న్యాయవాదులు, భారత్‌కు చెందిన విద్యార్థులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. రేపు (7న) బెలారస్‌లో ఈయూ లాయర్లతో సమావేశం అవుతారు. అలాగే హేగ్‌లోనూ ఆయన ఇలాంటి సమావేశంలోనే పాల్గొంటారని సమాచారం. 8న పారిస్ యూనివర్సిటీలోని భారతీయ విద్యార్థులతో సమావేశమై ప్రసంగిస్తారు. 9న పారిస్‌లో ఫ్రాన్స్ లేబర్ యూనియన్‌తో సమావేశం అవుతారు. ఆ తర్వాత నార్వేను సందర్శిస్తారు. 10న ఓస్లోలో డయాస్పొరా కార్యక్రమంలో ప్రసంగిస్తారు. 11న తిరిగి భారత్ చేరుకుంటారు.
ఈ నెల 9-10 మధ్య ఢిల్లీలో జీ20 నేతల సదస్సు జరగనుంది. జీ20 సదస్సుకు ఈసారి భారత్ అధ్యక్ష హోదాలో ప్రాతినిధ్యం వహిస్తోంది. 30కిపైగా దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్, ఆహ్వానిత దేశాల అతిథులతోపాటు అంతర్జాతీయ సంస్థలకు చెందిన 14 మంది అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది.