Udayanidhi: రాష్ట్రపతి, మహాభారత్ లను ఉదహరిస్తూ సనాతన ధర్మంపై మరోసారి ఉదయనిధి కామెంట్
- పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదన్న ఉదయనిధి
- సనాతన ధర్మంలోని కుల వివక్ష ఇది అని వ్యాఖ్య
- ఏకలవ్యుడి గురించి ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో విమర్శ
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని పలు పార్టీలు కూడా తప్పుపట్టాయి. తాజాగా ఆయన తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని.. ఇది సనాతధర్మంలోని కుల వివక్ష అని చెప్పారు.
మరోవైపు గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎప్పుడూ భావి తరాల గురించి మాత్రమే ఆలోచించే సాటిలేని వ్యక్తులు గురువులు అని కొనియాడారు. బొటనవేలును ఇవ్వాలని అడగకుండా ధర్మాన్ని బోధించే ఉపాధ్యాయులకు, ద్రావిడ ఉద్యమానికి ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. మహాభారతంలో పాండవులు, కౌరవుల గురువైన ద్రోణాచార్యుడు గిరిజనుడైన ఏకలవ్యుడిని బొటనవేలును గురుదక్షిణగా ఇవ్వాలని అడిగిన సంగతి తెలిసిందే. అర్జునుడి కంటే ఏకలవ్యుడు గొప్ప విలుకాడు అవుతాడనే భావనతో ఆయన విల్లు ఎక్కుపెట్టలేని విధంగా బొటనవేలిని దక్షిణగా తీసుకుంటాడు.