Sonia Gandhi: ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ

Sonia Gandhi Ask PM Modi Parliament Special Session Motive Letter

  • పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా చెప్పాలన్న కాంగ్రెస్ మాజీ చీఫ్
  • ప్రతిపక్షాలతో చర్చించకుండానే సమావేశాలకు పిలుపు ఎలా ఇస్తారని ప్రశ్న
  • ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

పార్లమెంట్ సమావేశాలు జరిపే ముందు ప్రతిపక్షాలతో చర్చలు జరపడం ఆనవాయితీ.. కానీ ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిందని సోనియా గాంధీ విమర్శించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు అజెండా ఏంటనేది కూడా వెల్లడించలేదని చెప్పారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ బుధవారం లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టతనివ్వాలని అందులో కోరారు.

‘ప్రతిపక్షాలతో ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడం ఇదే మొదటిసారి. ఈ సమావేశాలలో చర్చించబోయే విషయాలపై మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎందుకోసం సమావేశాలకు పిలుపునిచ్చారనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయండి’ అంటూ ప్రధాని మోదీని కోరారు.

ఈ అంశాలను అజెండాలో చేర్చండి: సోనియా
అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీలు, కులాల వారీగా జనగణన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజురోజుకూ దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హర్యానా సహా వివిధ రాష్ట్రాల్లో మత ఘర్షణలు, సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

18 నుంచి ప్రత్యేక సమావేశాలు
ఈ నెల 18వ తేదీ నుంచి 22వ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు రోజుల పాటు పార్లమెంట్ కొత్త భవనంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. అజెండాపై స్పష్టమైన ప్రకటన చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.. ఈ సమావేశాలలో జమిలి ఎన్నికలు, కొత్త చట్టాల రూపకల్పన, దేశం పేరు మార్చే తీర్మానం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News