Chandrakumar Bose: బీజేపీకి గుడ్‌బై చెప్పేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు

Chandrakumar bose grandnephew of subhash chandrabose leaves bjp

  • నేతాజీ దార్శనికతకు వాస్తవరూపం ఇవ్వడంలో పార్టీ సహకారం లేదన్న చంద్రకుమార్ బోస్
  • రాజీనామా లేఖను జేపీ నడ్డాకు పంపిన వైనం
  • పార్టీకి చంద్రకుమార్ బోస్ దూరంగా ఉంటున్నారన్న రాష్ట్ర బీజేపీ ప్రతినిధి
  • పార్టీ టిక్కెట్టుపై రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చంద్రకుమార్ బోస్
  • సీఏఏ చట్టం విషయంలో పార్టీ వైఖరిని వ్యతిరేకించిన వైనం

స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. పార్టీ వీడటానికి గల కారణాలను సవివరంగా వెల్లడిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

నేతాజీ దార్శనికతకు వాస్తవరూపం ఇస్తామన్న బీజేపీ తన హామీని నిలబెట్టుకోలేకపోయిందని ఆయన ఆరోపించారు. దీంతో, పార్టీని వీడక తప్పలేదని చెప్పారు. 

‘‘బీజేపీ వేదికగా నేతాజీ సోదరుల(సుభాష్, శరత్ చంద్రబోస్) సిద్ధాంతాలను నేటి తరానికి అందజేయాలని నేను భావించాను. ఇందుకు సహకరిస్తామని హైకమాండ్ కూడా గతంలో హామీ ఇచ్చింది. అయితే, ఈ లక్ష్యాలను చేరుకునేందుకు నాకు పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో సహకారం లభించట్లేదు. నా ప్రతిపాదనలను పట్టించుకోవట్లేదు’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, ఈ ఈ విషయంపై బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శ్రామిక్ భట్టాచార్య స్పందించారు. చంద్రకుమార్ బోస్ చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారని వెల్లడించారు. 

చంద్రకుమార్ బోస్ 2016 అసెంబ్లీ, 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్టుపై పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత పార్టీ అధిష్ఠానం ఆయనను బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. కానీ 2020లో పార్టీ నాయకత్వ మార్పుల్లో భాగంగా చంద్రకుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. చంద్ర కుమార్ బోస్ గతంలో పౌరసత్వ సవరణ చట్టం అంశంలో బీజేపీ విధానాలతో విభేదించారు. చట్టసభల్లో సంఖ్యాబలం ఉన్నంత మాత్రాన దుందుడుకు వైఖరి పనికిరాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News