Sonia Gandhi: బహుశా.. మీకు తెలియదేమో!: ప్రధాని మోదీకి సోనియాగాంధీ లేఖపై కేంద్రమంత్రి వ్యంగ్యాస్త్రాలు
- అజెండా బయటపెట్టాలంటూ మోదీకి లేఖ రాసిన సోనియా గాంధీ
- సెషన్ ప్రారంభమైన తర్వాత మాత్రమే ప్రభుత్వం అజెండాను చర్చిస్తుందన్న కేంద్రమంత్రి
- పార్లమెంట్ పనితీరును రాజకీయం చేస్తున్నారని ఆవేదన
అజెండా వెల్లడించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన సోనియా గాంధీకి అధికార పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమె లేఖను తప్పుబట్టారు. బహుశా సోనియా గాంధీకి సభా సంప్రదాయాల గురించి తెలియదు కావొచ్చు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సెషన్ ప్రారంభమైన తర్వాత మాత్రమే ప్రభుత్వం అజెండాను ప్రతిపక్షాలతో చర్చిస్తుందన్నారు.
సంప్రదాయాల ప్రకారం సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బహుశా మీరు సంప్రదాయాన్ని గుర్తించడం లేదేమో అని సోనియాను ఉద్దేశించి అన్నారు. పార్లమెంటు సమావేశాన్ని పిలవడానికి ముందు, రాజకీయ పార్టీలతో ఎప్పుడూ చర్చలు జరగవని, అలాగే సమస్యలపై చర్చ జరగదన్నారు. రాష్ట్రపతి సమావేశాలకు పిలిచిన తర్వాత... సమావేశాల ప్రారంభానికి ముందు అఖిల పక్ష సమావేశం ఉంటుందన్నారు. అప్పుడు అజెండా ఖరారవుతుందన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్, కార్యకలాపాలను రాజకీయం చేయడం, వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు.