Software engineer: బెంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చేశాక నెలకు రూ.40 వేలు పొదుపు చేస్తున్నా: టెకీ ట్వీట్
- సోషల్ మీడియలో వైరల్ గా మారిన ట్వీట్.. నెటిజన్ల మిశ్రమ స్పందన
- బెంగళూరులో ఖర్చుల గురించి వెల్లడించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
- హైదరాబాద్ లో ఖర్చులు తక్కువని వెల్లడి
బెంగళూరులో ఇంటద్దెల భారం గురించి తెలిసిందే.. భారీ మొత్తంలో అడ్వాన్స్, నెలనెలా పెద్ద మొత్తంలో రెంట్ చెల్లించాల్సి వస్తోందని గతంలో చాలామంది ఉద్యోగులు సామాజిక మాధ్యమాలలో వాపోయారు. ఆ పోస్టులు వైరల్ గా మారడం చూసే ఉంటారు. తాజాగా మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పృథ్వీరెడ్డి ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు.
కంపెనీలో రిమోట్ వర్కింగ్ ఆప్షన్ ఎంచుకుని తాను హైదరాబాద్ కు వచ్చేశానని చెప్పాడు. ఇక్కడికి వచ్చాక తన రోజువారీ ఖర్చులు నమ్మశక్యంకానంతగా తగ్గిపోయాయని, ప్రస్తుతం నెలకు రూ.40 వేల దాకా పొదుపు చేస్తున్నానని ట్వీట్ చేశాడు. ఈ మొత్తంతో ఓ సాధారణ కుటుంబం నెల మొత్తం సంతోషంగా జీవిస్తుందని చెప్పాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది పృథ్వీరెడ్డి మాటలతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం నిజమేనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదెలా సాధ్యమని ట్విట్టర్ లో ప్రశ్నించిన ఓ యూజర్ కు పృథ్వీ రెడ్డి జవాబిస్తూ.. బెంగళూరులో ఇంటద్దె, మెయింటనెన్స్, వాటర్, విద్యుత్ బిల్లులు, తిండి.. అంటూ ఖర్చుల వివరాలు చెప్పాడు. కాగా, బెంగళూరులోనే కాదు ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా కాస్టాఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయిందని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఏ సిటీలో అయినా సరే.. ప్రాంతాన్ని బట్టి ఇంటద్దె, ఇతర ఖర్చుల లెక్కలు మారుతుంటాయని, అన్నీ కలుపుకుంటే రెండు నగరాల్లోనూ ఖర్చులు దాదాపుగా ఒకేలా ఉంటాయని అంటున్నారు.