Mitchell Starc: ఐపీఎల్ 2024 సీజన్ కు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పునరాగమనం
- వచ్చే ఏడాది వేలంలో పాల్గొంటానని ప్రకటన
- ఐపీఎల్ ఆడి ఎనిమిదేళ్లు అయిందన్న స్టార్ పేసర్
- 2018లో కోల్ కతా కొనుగోలు చేసినా గాయం కారణంగా దూరం
ప్రముఖ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ లోకి మళ్లీ రాబోతున్నాడు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా స్టార్క్ ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నాడు. ముఖ్యంగా మాతృదేశం తరఫున టెస్ట్, వన్డే మ్యాచ్ లకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ లోకి తిరిగి అడుగు పెట్టాలన్న ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేశాడు.
మిచెల్ స్టార్క్ చివరిగా 2015లో ఐపీఎల్ లో పాల్గొన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున రెండు సీజన్లలో 27 మ్యాచుల్లో పాల్గొన్నాడు. 2018లో స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ, గాయం కారణంగా తప్పుకున్నాడు. ఐపీఎల్ లో ఆడాలన్న ఆకాంక్షను పలు సందర్భాల్లో అతడు వ్యక్తం చేస్తూ వచ్చాడు. కానీ స్వదేశానికే ప్రాధాన్యం ఇచ్చాడు. కాకపోతే వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టుకు పని భారం తక్కువగా ఉండనుంది. మార్చిలో న్యూజిలాండ్ టూర్ తర్వాత.. తిరిగి ఆగస్ట్ చివరి వరకూ ఖాళీనే.
‘‘ఇప్పటికి ఎనిమిదేళ్లు అయింది ఐపీఎల్ ఆడి. కనుక నేను తప్పకుండా వచ్చే ఏడాది వేలంలో పాల్గొంటాను’’ అని స్టార్క్ ప్రకటించాడు. స్టార్క్ బౌలింగ్ నైపుణ్యాల దృష్ట్యా అతడి కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. చెన్నై జట్టు సైతం అతడి కోసం పోటీ పడొచ్చు.