children: మూడేళ్లలోపు పిల్లలను స్కూల్ కు పంపించడం నేరం: గుజరాత్ హైకోర్ట్
- విద్యా హక్కు చట్టం నిబంధనలు ఉల్లంఘించడంగా పేర్కొన్న న్యాయస్థానం
- మూడేళ్ల పూర్వ ప్రాథమిక విద్య చాలన్న ధర్మాసనం
- మూడేళ్లలోపు పిల్లలను చేర్చుకోరాదని ఆదేశాలు
వికసించని లేత మనసుల విషయంలో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడేళ్ల లోపు పిల్లలను బలవంతంగా ప్రీ స్కూల్ కు పంపించడం చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతిలోకి ప్రవేశం పొందాలంటే వయసు ఆరేళ్లు నిండాలంటూ ఇటీవల గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు కాగా, వాటిపై హైకోర్టు విచారణ నిర్వహించింది.
2023 జూన్ 1 నాటికి ఆరేళ్ల వయసు నిండని తల్లిదండ్రులు ప్రభుత్వ నోటిఫికేషన్ ను సవాలు చేశారు. ‘‘మూడేళ్లలోపు ఉన్న పిల్లలను ప్రీ స్కూల్ కు వెళ్లాలని బలవంత పెట్టడం కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల వైపు నుంచి చట్టవ్యతిరేకం అవుతుంది. పిటిషనర్లు విద్యా హక్కు చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కనుక వారు ఎలాంటి ఉపశమనం కోరబోరు’’ అని చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అంజారియాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
జూన్ 1 నాటికి మూడేళ్ల వయసు పూర్తి చేసుకోని విద్యార్థులను ప్రీ స్కూల్స్ చేర్చుకోరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల పాటు ప్రీ స్కూల్ విద్య, సంరక్షణ అనేవి మొదటి తరగతిలో ప్రవేశానికి చిన్నారులను సిద్ధం చేసినట్టు అవుతుందని పేర్కొంది. అయితే జూన్ 1 నాటికి కటాఫ్ తేదీ వల్ల 9 లక్షల మంది చిన్నారులు ఈ ఏడాది విద్యకు దూరం కావాల్సి వస్తోందంటూ తల్లిదండ్రుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూడేళ్ల పాఠశాల ముందస్తు విద్యను పూర్తి చేసుకున్న వారికి కటాఫ్ తేదీతో సంబంధం లేకుండా ఒకటో తరగతిలో ప్రవేశాలకు అనుమతించాలని కోరారు. దీనికి హైకోర్టు సమ్మతించలేదు.