Satyaraj: నేను ఉదయనిధి వైపే... మద్దతు పలికిన నటుడు సత్యరాజ్
- సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
- దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన
- భగ్గుమంటున్న హిందూ సంఘాలు, సాధువులు
- ఉదయనిధికి క్రమంగా పెరుగుతున్న మద్దతు
తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటిదని, నిర్మూలించకపోతే ప్రమాదమని ఉదయనిధి ఓ కార్యక్రమంలో అన్నారు.
దీనిపై సాధువులు, హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఓ సాధువు ఉదయనిధి తలకు రూ.10 కోట్ల వెల ప్రకటించాడు. ఉదయనిధి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో కొందరు ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థిస్తూ, ఆయనకు మద్దతిస్తున్నారు.
తాజాగా, ప్రముఖ దక్షిణాది నటుడు సత్యరాజ్ కూడా తాను ఉదయనిధి వైపేనని స్పష్టం చేశారు. ఉదయనిధి అన్న మాటల్లో తప్పేముందని సత్యరాజ్ అన్నారు. ఉదయనిధి నిర్భయంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని, సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు. ఇంత ధైర్యంగా తన అభిప్రాయాలు వెల్లడించినందుకు ఆయనను అభినందిస్తున్నానని సత్యరాజ్ తెలిపారు. ఓ మంత్రిగా ఉదయనిధి కార్యాచరణ, వ్యవహార శైలి పట్ల గర్విస్తున్నామని అన్నారు.