Congress: ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అంగీకరించదు: పవన్ ఖేరా
- కాంగ్రెస్ పార్టీకి అన్ని మతాలు సమానమేనని వ్యాఖ్య
- ఒక నమ్మకం గొప్ప.. మరో నమ్మకం తక్కువ అని ఎవరూ చెప్పజాలరన్న నేత
- రాజ్యాంగం కూడా అందుకు అనుమతించదని స్పష్టీకరణ
డీఎంకే నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించదని ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీకి అన్ని మతాలు సమానమే అన్నారు. అలాగే, I.N.D.I.A. కూటమిలోని అన్ని పార్టీలు కూడా అన్ని మతాలను, కులాలను, నమ్మకాలను సమానంగా గౌరవిస్తాయన్నారు. ఒక నమ్మకం గొప్ప.. మరో నమ్మకం తక్కువ అని ఎవరూ చెప్పలేరని తెలిపారు. రాజ్యాంగం కూడా అందుకు అనుమతించదన్నారు.
పరిశీలిస్తే దశాబ్దాలుగా కాంగ్రెస్ అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తున్నట్లుగా అర్థమవుతుందని చెప్పారు. భారత రాజ్యాంగ సభ చర్చలు, రాజ్యాంగం విషయంలోనూ ఇదే సూత్రాలను పాటించినట్లు తెలిపారు. ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలను ఆలస్యంగా ఖండించడంపై ఆయన స్పందిస్తూ... ఇప్పుడైతే ఖండించాం కదా అన్నారు.