Telangana: వరుడు పెళ్లికి వెళుతుండగా భారీ ట్రాఫిక్ జాం.. ముహూర్తం మించిపోకుండా ఆదుకున్న పోలీసులు
- గురువారం హనుమకొండ నుంచి తొర్రూరుకు బయలుదేరిన వరుడు
- వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఇల్లంద వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా
- దాన్ని పక్కకు తొలగించేందుకు రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిపివేసిన పోలీసులు
- భారీ ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయిన వరుడు, ముహూర్తం దాటిపోతుందేమోనని కలవరం
- పోలీసుల వద్ద గోడు వెళ్లబోసుకున్న బాధితుడు
- అతడి మార్గం సుగమం చేసి కథ సుఖాంతం చేసిన పోలీసులు
పెళ్లికి వెళుతున్న ఓ వరుడు భారీ ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయాడు. ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ అతడిలో టెన్షన్ పెరిగిపోయింది. మూహుర్తంలోపల మండపానికి చేరుకుంటానన్న నమ్మకం క్షణక్షణానికీ సన్నగిల్లుతున్న సమయంలో అతడు పోలీసులను ఆశ్రయించాడు. వారి సాయంతో సమస్య నుంచి గట్టెక్కాడు.
వరుడు గురువారం హనుమకొండ నుంచి తొర్రూరుకు బయలుదేరాడు. కానీ వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఇల్లంద గ్రామ శివారులో ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు పక్కన గొయ్యిలో పడింది. దాన్ని తొలగించేందుకు పోలీసులు సుమారు రెండున్నర గంటల పాటు రోడ్డుపై ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో భారీ ట్రాఫిక్ జాంలో వరుడు చిక్కుకుపోయాడు. ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ అతడిలో టెన్షన్ పెరిగిపోయి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. అతడి పరిస్థితి అర్థం చేసుకున్న వారు మార్గం సుగమం చేసి అతడిని పంపించారు. దీంతో కథ సుఖాంతమైంది.