G20: జీ20 సమావేశాలకు స్పెయిన్ అధ్యక్షుడు దూరం.. కారణం ఇదే!
- స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ కు కరోనా పాజిటివ్
- జీ20 సమావేశాలకు వెళ్లలేకపోతున్నానని ట్వీట్
- రేపు, ఎల్లుండి జరగనున్న జీ20 సమ్మిట్
ఢిల్లీలో రేపటి నుంచి రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరగనున్నాయి. జీ20 దేశాలు సహా 40కి పైగా దేశాధినేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ హాజరుకావడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పుతిన్, ఇతర కారణాల వల్ల జిన్ పింగ్ రావడం లేదు. ఈ జాబితాలో మరో దేశాధినేత కూడా చేరారు.
స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ ఈ సమావేశాలకు రావడం లేదు. పెడ్రో శాంచెజ్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్టులో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్వయంగా తెలిపారు. కరోనా కారణంగా ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు వెళ్లలేకపోతున్నానని ఆయన చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు.