Vidadala Rajini: 15వ తేదీ నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే.. 30 నుంచి వైద్య శిబిరాలు: ఏపీ మంత్రి విడదల రజని
- వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారన్న రజని
- ఆ తర్వాత వైద్య సిబ్బంది వ్యాధుల వివరాలను నమోదు చేస్తారని వెల్లడి
- వైద్య శిబిరాల్లో వైద్యులు చికిత్స అందిస్తారన్న మంత్రి
ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటింటికీ ఆరోగ్య సర్వేను చేపట్టబోతున్నట్టు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని తెలిపారు. సెప్టెంబర్ 30 నుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇంటింటికీ ఆరోగ్య సర్వేలో గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి... ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారని చెప్పారు. ప్రజల నుంచి సేకరించిన వివరాలను ఏఎన్ఎంలు, క్లస్టర్ స్థాయి ఆరోగ్య అధికారులకు అందిస్తారని తెలిపారు. ఆ తర్వాత సంబంధిత ఇళ్లను ఆరోగ్య సిబ్బంది సందర్శించి వ్యాధుల వివరాలను నమోదు చేస్తారని... బీపీ, షుగర్ తదితర పరీక్షలను నిర్వహిస్తారని చెప్పారు.
అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా టోకెన్ నంబర్లు ఇస్తారని రజని తెలిపారు. అనంతరం ఈ నెల 30 నుంచి జగనన్న వైద్య శిబిరాల్లో రోగులకు చికిత్స అందిస్తారని చెప్పారు. అవసరమైతే రోగులను ఆసుపత్రులకు రెఫర్ చేస్తారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య శిబిరాలకు తహసీల్దార్, ఎంపీడీఓ, పీహెచ్సీ వైద్యులు బాధ్యత వహిస్తారని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ అధికారి, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ప్రతి ఆరోగ్య శిబిరంలో రోగులకు చికిత్స చేసేందుకు వైద్య పరికరాలను ఉంచడంతో పాటు... 105 రకాల మందులను ఉచితంగా అందుబాటులో ఉంచుతారని చెప్పారు.