Serial Killer: వేశ్యల పాలిట యముడు... 14 మంది దారుణ హత్య
- ఆఫ్రికా దేశం రువాండాలో దారుణం
- కిగాలీ నగరంలో వేశ్యలను ఇంటికి పిలిపించుకుని హత్య
- మృతదేహాలను కిచెన్ లో పాతిపెట్టిన వైనం
- కొన్ని మృతదేహాలను యాసిడ్ పోసి కరిగించిన నరరూప రాక్షసుడు
- హతుల్లో మగ వేశ్యలు!
ఆఫ్రికా దేశం రువాండాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ మారణకాండ వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఏకంగా 14 మంది వేశ్యలను హత్య చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
రువాండా రాజధాని కిగాలీలో ఈ నరరూప రాక్షసుడు ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. అతడి వయసు 34 సంవత్సరాలు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని హత్య చేసి, వారి నుంచి నగదు, ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకునేవాడు. అనంతరం వారి మృతదేహాలను కిచెన్ లో ఓ గొయ్యి తీసి పాతిపెట్టేవాడు.
ఆ సీరియల్ కిల్లర్ ను కిగాలీ పోలీసులు జులైలో దోపిడీ, అత్యాచారం, ఇతర ఆరోపణలపై అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడంతో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. పట్టువదలని పోలీసులు ఆ వ్యక్తి నివసిస్తున్న ఇంటిలో మరోసారి తనిఖీలు చేపట్టగా, కిచెన్ లో పాతిపెట్టిన మృతదేహాలు బయటపడ్డాయి.
10 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఆ కిరాతకుడ్ని అరెస్ట్ చేసి విచారించగా, మరో నలుగురు వేశ్యల మృతదేహాలను యాసిడ్ పోసి కరిగించినట్టు వెల్లడించాడు. కాగా, కుటుంబాలకు దూరంగా ఉండే వేశ్యలను, పెద్దగా స్నేహితులు లేని వేశ్యలను అతడు లక్ష్యంగా చేసుకునేవాడని పోలీసులు విచారణలో వెల్లడైంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆ సీరియల్ కిల్లర్ చేతిలో హతులైన వారిలో కొందరు మగ వేశ్యలు కూడా ఉన్నారట.