Kala Venkata Rao: ఏపీలో కరెంటు లేక బట్టలారేసుకుంటున్నారన్న తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు జగన్ కు సిగ్గుగా అనిపించడం లేదా?: కళా వెంకట్రావు
- విద్యుత్ రంగంలో చంద్రబాబు సంస్కరణలు తెచ్చాడన్న కళా వెంకట్రావు
- కానీ జగన్ వాటన్నింటిని ధ్వంసం చేశాడని విమర్శలు
- విద్యుత్ కోతలు, చార్జీల మోతతో ప్రజలపై భారం మోపుతున్నాడని వెల్లడి
విద్యుత్ రంగంలో చంద్రబాబు సంస్కరణలు తెస్తే జగన్ రెడ్డి విధ్వంసం చేశాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. కరెంటు కోతలు, చార్జీల మోతతో ప్రజలపై భారం మోపడం పెత్తందారు పాలన కాదా? అని నిలదీశారు. విద్యుత్ రంగంలో విప్లవం తెస్తానని విపక్షంలో ఉన్నప్పుడు ప్రవచనాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి రాగానే మోసం చేశాడని విమర్శించారు.
"వేళాపాళా లేని విద్యుత్ కోతలు, చార్జీల మోతతో ప్రజలపై భారం మోపుతున్నాడు. ఏపీలో కరెంటు లేక బట్టలారేసుకుంటున్నారన్న తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు వింటే జగన్ రెడ్డికి సిగ్గుగా అనిపించడం లేదా? చంద్రబాబు గారు సాధించిన నిరంతర విద్యుత్ సరఫరాకు గండి కొట్టడం జగన్ రెడ్డి పాలనా అసమర్థతకు నిదర్శనం కాదా?
ఒక్క చాన్స్ ఇస్తే 9 గంటల ఉచిత విద్యుత్ తో పాటు విద్యుత్ చార్జీలు తగ్గిస్తానన్న జగన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై రూ. 57 వేల కోట్లకు పైగా భారం వేయడం పెత్తందారు పాలన కాదా? నెలవారీ బిల్లు చూస్తుంటే స్విచ్ వేయకుండానే ప్రజలకు కరెంటు షాక్ కొట్టడం వాస్తవం కాదా?
ఒక్క తాడేపల్లి ప్యాలెస్ మినహా రాష్ట్రంలో కరెంటు కోత లేని నగరం, గ్రామం ఉందా? కరెంటు లేక ఆసుపత్రుల్లో సెల్ ఫోన్లు, టార్చ్ లైట్ వెలుతురులో ఆపరేషన్లు చేయాల్సిన దుస్థితి రావడం జగన్ రెడ్డి పాలనా వైఫల్యం కాదా?
చంద్రబాబు విద్యుత్ రంగంలో తెచ్చిన సంస్కరణలతో రాష్ట్రం మిగులు విద్యుత్ సాధించింది. ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు, వ్యవసాయానికి 7 గంటలు ఉచిత్ విద్యుత్ అందించారు.
మరి జగన్ రెడ్డి చేస్తున్నదేంటి? 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయకపోగా వినియోగదారుడి నుంచి వినియోగ చార్జ్ వసూలు చేయడం సిగ్గుచేటు కాదా? సుంకాలు, ట్రూ అప్ చార్జీల రూపంలో ప్రజల నడ్డి విరుస్తున్నారు" అంటూ కళా వెంకట్రావు విమర్శించారు.