Bengaluru: నడివీధిలో నిలిచిపోయిన హెలికాఫ్టర్.. భారీగా ట్రాఫిక్ జాం
- బెంగళూరులో వెలుగు చూసిన దృశ్యం
- హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సమీపంలో నడివీధిలో నిలిచిపోయిన హెలికాఫ్టర్
- సోషల్ మీడియాలో ఈ ఘటన తాలుకు దృశ్యాలు వైరల్
- కొంటె జోకులతో పెద్ద ఎత్తున స్పందించిన నెటిజన్లు
భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అక్కడి ట్రాఫిక్ సమస్యే. ట్రాఫిక్ జాంలు అక్కడ నిత్యకృత్యం. అయితే, తాజాగా ఓ హెలికాఫ్టర్ కారణంగా బెంగళూరులో ట్రాఫిక్కు భారీ అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో ప్రస్తుతం వైరల్గా మారాయి.
నగరంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కార్యాలయానికి సమీపంలో రోడ్డు మధ్యలో ఈ హెలికాఫ్టర్ ల్యాండయ్యింది. దీంతో, రహదారిపై వాహనాలు చాలా సేపు నిలిచిపోయాయి. ఓ సాధారణ కారో, మరో వాహనం లాగానో హెలికాఫ్టర్ రోడ్డుపై నిలిచిపోవడంతో స్థానికులు తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు నెటిజన్లు ఛలోక్తులు కూడా విసిరారు. ‘‘డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు వాహనదారులకే కాదు పైలెట్లకు కూడా చేస్తూ ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు’’ అంటూ ఓ వ్యక్తి పంచ్ వేశాడు.