Daniil Medvedev: యూఎస్ ఓపెన్: వరల్డ్ నెంబర్ వన్ అల్కరాజ్ కు షాకిచ్చిన మెద్వెదెవ్

Daniil Medvedev defeats world number one Carlos Alcaraz in US Open semis

  • ఆసక్తికరంగా సాగిన సెమీస్
  • 7-6, 6-1, 3-6, 6-3తో మెద్వదెవ్ గెలుపు
  • యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన డిఫెండింగ్ చాంప్ అల్కరాజ్
  • ఫైనల్లో జకోవిచ్ తో తలపడనున్న మెద్వెదెవ్

వరల్డ్ నెంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్ సమరంలో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్... అల్కరాజ్ కు షాకిచ్చాడు. 

హోరాహోరీగా సాగిన పోరులో మూడో సీడ్ మెద్వెదెవ్ నమ్మశక్యం కాని ఆటతీరుతో స్పెయిన్ యువకెరటం అల్కరాజ్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. 7-6, 6-1, 3-6, 6-3తో మెద్వదెవ్ జయకేతనం ఎగురవేశాడు. తద్వారా యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 

ఈ మ్యాచ్ లో మెద్వెదెవ్ ఆటతీరు మరోస్థాయిలో ఉందంటే అతిశయోక్తి కాదు. బలంగా కనిపించే అల్కరాజ్ తో పోల్చితే బక్కపల్చగా ఉండే ఈ రష్యన్ ఆటగాడు పదునైన సర్వీసులతో ఆకట్టుకున్నాడు. బ్రేక్ పాయింట్లు గెలవడంలో ఒడుపు చూపించిన మెద్వెదెవ్ కీలక సమయాల్లో అల్కరాజ్ ను నిలువరించి తొలి రెండు సెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 

అయితే మూడో సెట్ లో అల్కరాజ్ పుంజుకుని ఆ సెట్ ను 6-3తో చేజిక్కించుకున్నాడు. కానీ ఆ ఊపు తాత్కాలికమే అయింది. నాలుగో సెట్ ను మెద్వెదెవ్ 6-3తో గెలుచుకుని, తద్వారా అల్కరాజ్ కు కళ్లెం వేశాడు. 

ఇక, సోమవారం జరిగే ఫైనల్లో మెద్వెదెవ్... నెంబర్ 2 సీడ్ నొవాక్ జకోవిచ్ ను ఢీకొంటాడు. అర్ధరాత్రి జరిగిన మరో సెమీస్ లో జకోవిచ్ 6-3, 6-2, 7-6తో అమెరికా యువ ఆటగాడు బెన్ షెల్టన్ పై అలవోకగా నెగ్గాడు.

  • Loading...

More Telugu News