Kanakamedala Ravindra Kumar: రాజకీయ అంశాలను వ్యక్తిగత కక్షగా మార్చుకుని చంద్రబాబుపై పగ సాధిస్తున్నారు: కనకమేడల
- టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్
- ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కనకమేడల
- రాష్ట్రంలో అప్రటికత ఎమర్జెన్సీ వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శలు
- జగన్ అరాచకపు పాలనకు పరాకాష్ఠ అని వ్యాఖ్యలు
తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పిరికింద చర్య అని అభివర్ణించారు.
అర్ధరాత్రి వేళ నాయకులను అరెస్ట్ చేయడం, కార్యకర్తలను రోడ్లపైకి రానివ్వకుండా చేయడం, నాయకులెవరూ ప్రతిఘటించడానికి వీల్లేకుండా చేయడం, రాష్ట్రమంతటా ఒక ఆందోళనకర పరిస్థితిని సృష్టించడం అప్రకటిత ఎమర్జెన్సీ తప్ప మరొకటి కాదని మండిపడ్డారు.
ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నవారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని కనకమేడల అన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకపు పాలనకు ఇది పరాకాష్ఠ అని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో న్యాయపరమైన అంశాలు పరిశీలించి, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"న్యాయపరమైన అంశాలు అని ఎందుకు చెబుతున్నానంటే... రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాలు అంటే కనీస గౌరవం లేదు. ఇక్కడి హైకోర్టు కానీ, అక్కడి సుప్రీంకోర్టు కానీ 250 కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టాయి. చీము నెత్తురు ఉన్నవాడైతే ఎప్పుడో రాజీనామా చేసి వెళ్లిపోయేవాడు" అంటూ కనకమేడల ధ్వజమెత్తారు. రాజకీయపరమైన అంశాలను వ్యక్తిగత కక్షగా మార్చుకుని చంద్రబాబుపై పగ సాధిస్తున్నారని విమర్శించారు.
"రాజకీయాల్లో సాధారణంగా శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉంటారు. కానీ ప్రత్యర్థులను శత్రువులుగా మార్చి, ఒక ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారు. ఏపీ సీఎం బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఒకసారి పరిశీలించండి. అతడు ఫ్యాక్షనిస్టు నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. దానికి అధికారం తోడైంది. పోలీసుల వత్తాసుతో, రాజ్యాంగాన్ని కాలరాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు పిరికిపంద చర్య అవుతుందే తప్ప, చట్టబద్ధమైన చర్య కాదు" అని కనకమేడల స్పష్టం చేశారు.